ఆంధ్రప్రదేశ్ లిక్కర్ పాలసీని జగన్ రెడ్డి మార్చబోతున్నట్లుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. నిధుల సమస్య వెంటాడుతూండటంతో మందుబాబుల్ని మరింత పిండుకోవడం.. ఇంత కాసం చేసిన దోపిడీ మర్చిపోయేలా చేయడానికి మళ్లీ దుకాణాల వేలం నిర్వహించాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వమే నడుపుతోంది. దశల వారీగా మద్య నిషేధం హామీ.ఇచ్చిన జగన్ వచ్చే ఎన్నికల నాటికి ఫైవ్ స్టార్ హోటళ్లకు మాత్రమే మద్యం పరిమితం చేసి ఓట్లు అడుగుతామన్నారు. కానీ కానీ ఆ దిశగా చర్యలు లేవు. చేతులు ఎత్తేశారు. మద్య నిషేధం గురించి ఎవరైనా అడిగితే పేద పథకాలకు డబ్బులు రాకుండా చేస్తున్నారని అంటున్నారు. దీన్ని బట్టే జగన్ రెడ్డి మైండ్ సెట్‌ను అర్థం చేసుకోవచ్చంటున్నారు.
ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీ అక్టోబర్ ఒకటికి ముగుస్తుంది. మళ్లీ కొత్తగా ఇదే పాలసీని కొనసాగిస్తున్నట్లుగా జీవో ఇవ్వాలి. కానీ మళ్లీ వేలం పాటల ద్వారా ప్రయివేటు వ్యక్తులకు నిర్వహణ బాధ్యతలు అప్పగించడంపై ఓ నివేదికను రెడీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లడానికి నిధుల సమీకరణ కోసం ఎప్పుడో డిసెంబర్ లో ముగిసే లైసెన్స్ ల కోసం ఇప్పుడే దరఖాస్తులు తీసుకుని వేలం వేస్తోంది. ఒక్కో దరఖాస్తుకు రెండు లక్షలకుపైగా ఫీజు పెట్టడంతో.. రెండున్నర వేల కోట్ల వరకూ ఆదాయం వస్తోంది. అదే ఏపీ ప్రభుత్వ పెద్దలను కూడా ఆకర్షిస్తోందని చెబుతున్నారు.
ప్రస్తుతం ఏపీ సర్కార్ కు నిధుల కటకట ఉంది. ఈ విధానానికి మారడం వల్ల సంక్షేమ పథకాలకు కావాల్సిన నిధులు ఒకేసారి సమకూరుతాయని అంటున్నారు. విధాన మార్పు చేయాల్సి వస్తే దీనిని శాసనసభలో పెట్టాల్సి ఉంటుంది. జగన్ రెడ్డి అనుకుటే వచ్చే నెలలో జరగనున్న వర్షాకాల సమావేశాల్లో మద్యం పాలసీ మార్పు బిల్లును కూడా పెట్టే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.