ఏపీ ప్రభుత్వ రివర్స్ జర్నీలో ఈ సారి మద్యం దుకాణాలు చేరాయి. ఓ నిర్ణయం తీసుకోవడం దాని వల్ల జరగాల్సినంత నష్టం జరగడమో.. లేకపోతే కావాల్సిన ప్రయోజనాన్ని పిండుకోవడమే చేసిన తర్వాత మళ్లీ రివర్స్ చేసుకోవడం మూడేళ్లుగా జరుగుతోంది. ఈ రివర్స్ వల్ల పోలవరం ప్రాజెక్ట్ నుంచి బోగాపురం ఎయిర్ పోర్టు వరకూ మొత్తం మూలన పడ్డాయి. కానీ బాగా లాభపడింది మాత్రం మద్యం విషయంలో ప్రభుత్వమే. ఏటా రూ. ఆరు వేల కోట్లు ఉన్న ఆదాయం రూ. పాతిక వేల కోట్లకు చేరింది. అయితే ఇప్పుడు మరింత ఆదాయం కోసం మళ్లీ ఈ అంశంలోనూ రివర్స్కెళ్తున్నారు .
ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం దుకాణాలను త్వరలో ప్రైవేటుకు ఇవ్వాలని నిర్ణయించారు. అంటే మళ్లీ వేలం పాట నిర్వహిస్తారన్నమాట. అలా వేలం పాట నిర్వహించి ప్రైవేటు వారికి ఇస్తే పెద్ద ఎత్తున లైసెన్స్ ఫీజులు వస్తాయని.. వారు మద్యం అమ్మకాలను పెంచుతారని లెక్కలతో సహా నివేదికను రెడీ చేసుకున్న ప్రభుత్వం.. ఆ నిర్ణయం తీసుకోబోతున్నామని మీడియాకు లీక్ ఇచ్చింది. త్వరలో దీనికి సంబంధించిన కార్యాచరణ ఖరారు అవుతుంది. మద్యం దుకాణాలను కూడా గతంలోలా పెంచే చాన్సులు ఉన్నాయి. ఇప్పటికే బార్ల పాలసీని మూడేళ్లకు ప్రకటించి… మద్యనిషేధంపై మడమ తిప్పేశామని చెప్పేశారు.
ఇప్పుడు మద్యం దుకాణాలను కూడా ప్రైవేటుకు ఇస్తే.. రెండు, మూడేళ్లకు కేటాయించాలి. ఏడాదిన్నరలో ఎన్నికలకు వెళ్లాల్సిన ప్రభుత్వం రెండేళ్లకు.. మూడేళ్లకు మద్యం దుకాణాలను కేటాయిస్తే అది నయవంచనే. అయినా సరే ముందుకే వెళ్లాలనుకుంటున్నారు. ప్రభుత్వానికి ఇప్పుడు మద్యంపై రూ. పాతిక వేల కోట్ల ఆదాయం వస్తోంది. దాన్ని నలభై వేల కోట్లకు తీసుకెళ్తే.. సంక్షేమానికి కావాల్సినంత అప్పులు వస్తాయని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే రివర్స్ కోసం స్పీడ్‌గా వెళ్తున్నారు.
అయితే మద్యం ఆదాయం ఉత్పాదక ఆదాయం కాదు. ప్రజల నుంచి పీల్చి పిప్పి చేసి వసూలు చేస్తున్న సొమ్ము. దాని వల్ల రాష్ట్రానికి కీడే జరుగుతుంది కానీ మేలుకాదు. ఈ విషయంపై ఎన్ని నివేదికలు ఉన్నా ప్రభుత్వం మాత్రం ఆదాయం కోసమే ముందుకెళ్తోంది.