“రాష్ట్రాన్నైనా రాసిచ్చేస్తాను కానీ.. నా కూతుర్ని మాత్రం నీకివ్వను” అని ఓ సినిమాలో మంత్రి గారైన వాణిశ్రీ పదే పదే డైలాగ్ చెబుతూ ఉంటారు. ఆ డైలాగ్ ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి తన చేతలతో నిరూపిస్తున్నారు. రాష్ట్రాన్ని రాసిచ్చేస్తాను.. కూల్చేస్తాను.. ఇంకైమైనా చేస్తాను కానీ.. తన కేసుల నుంచి రక్షణ పొందితే చాలనుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్తులకు పాలకులు కస్టోడియన్ మాత్రమే. ప్రజలు అధికారం ఇచ్చారంటే ఇష్టారీతిన ప్రభుత్వ ఆస్తులను అమ్మడానికి, తాకట్టుపెట్టడానికి.. ధ్వంసం చేయమని కాదు. చేతనైతే.. ప్రభుత్వ ఆస్తులను పెంచాలి. చేతకాకపోతే కనీసం ఉన్న ఆస్తులను భద్రంగా చూసుకోవాలి. అంతే కానీ.. తమ ఇష్టం లేదని కూల్చి వేయడం.. ఇష్టం ఉన్నవి అస్మదీయులకు కట్టబెట్టేయడం.. అలా ఇవ్వడానికి సాధ్యం కానీ ఆస్తుల్ని తాకట్టు పెట్టేయడం చేయకూడదు. అలా చేయడం ప్రజల్ని వంచించడమే. దురదృష్టవశాత్తూ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అదే చెస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుండి ప్రజా ఆస్తుల్ని ధ్వంసం చేయడమో.. ఇతరులకు కట్టబెట్టడమో.. తాకట్టు పెట్టడమో చేస్తూ వస్తున్నారు. సంపద పెంచింది లేకపోగా.. ఇలా ప్రభుత్వ ఆస్తుల్ని దహించుకుపోయేలా చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ప్రజాద్రోహమే అవుతుంది.
డెయిరీ ఆస్తులు మొత్తం అమూల్ పరం !
చిత్తూరు డైరీని అమూల్ సంస్థకు 99 ఏళ్ల పాటు లీజ్‌కు ఇస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. చిత్తూరు డెయిరీని చంద్రబాబు నిర్వీర్యం చేశారంటూ ఆరోపణలు చేసి.. తాము వస్తే డెయిరీని తెరిపిస్తామని హామీ ఇచ్చారు. ఇదే హామీ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఇచ్చారు. ఇద్దరూ అధికారంలోకి వచ్చారు. ఎవరూ తెరిపించే ప్రయత్నం చేయలేదు. అయితే జగన్ కన్నా రాజశేఖర్ రెడ్డి నయం అనుకునేలా.. తెరిపించకపోగా.. అమూల్‌కు ధారదత్తం చేయాలని జగన్ నిర్ణయించుకున్నారు. అదీ కూడా 99 ఏళ్లకు. మొత్తం 33 ఎకరాల్లో విస్తరించిన ఈ డెయిరీ స్థలం విలువ రూ.500 కోట్లుగా ఉంటుందని అంచనా.మొత్తానికి రూ.500 కోట్ల ఆస్తులున్న విజయా డెయిరీని ఏడాదికి రూ.కోటి మాత్రమే తీసుకుని ఏకంగా 99 ఏళ్ల లీజుకిచ్చేసింది. చిత్తూరు డెయిరీ లెటెస్ట్ నిర్ణయమే గతంలోనే రాష్ట్రంలో గల ఎపి డెయిరీ ఆస్తులను అమూల్‌కు కట్టబెడుతూ ఉత్తర్వులు జారీ చేసేసింది. ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ది సంస్థ (ఎపి డెయిరీ) ఆస్తులను ఉత్పత్తి ఆధారిత లీజుపై గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (అమూల్)కు అప్పగించేందుకు ప్రభుత్వం జీవో ఇచ్చింది. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న వివిధ జిల్లాల మిల్క్ యూనియన్ల అతిక్రమణ కింద ఉన్న ఆస్తులను, సేకరించిన, కొనుగోలు చేసిన, పంపాదించిన, తమ ఆధీనంలో ఉంచుకొని అనుభవిస్తున్న ఆస్తులను అమూల్‌కు లీజుకు ఇస్తారు. ఎపి డెయిరీ ఆస్తులను అమూల్‌కు లీజుకు ఇచ్చే అంశం ఎంఒయులో ఉంది. ఈ ఆస్తులు కొన్ని వేల కోట్లలోనే ఉంటాయి. అసలు సహకార డెయిరీలను నిర్వీర్యం చేసి.. వాటిని అమూల్‌కు అప్పగించాల్సిన అవసరం ఏమిటి ? వాటి మానాన వాటిని పని చేసుకోనిచ్చి.. ప్రోత్సాహకాలు ఏవో అందిస్తే.. అవి నిలబడేవి కావా ?. అమూల్‌ను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు. దీని వల్ల వచ్చే లాభం ఏమిటి ? ఏపీ ప్రభుత్వం నుంచి వేల కోట్ల ఆస్తులను లీజు రూపంలో తీసుకుంటున్న అమూల్.. ఏపీలో ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టడం లేదు. మొత్తం తెలంగాణకే తరలిస్తోంది. అక్కడ రెండు భారీ ప్లాంట్లు పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది.
పోర్టులు.. విద్యుత్ ప్రాజెక్టులు.. భూములు ఏపీలో సగం ప్రభుత్వ ఆస్తులు అదానీకే కట్టబెట్టేసిన ప్రభుత్వం !
ఆంధ్రప్రదేశ్ ప్లస్ పాయింట్ సుదీర్ఘ తీరమని.. పోర్టులతో తట్టుకోలేనంత అభివృద్ధి చేస్తామని గత ప్రభుత్వం.. ఈ ప్రభుత్వం కూడా.. చాలా చాలా మాటలు చెబుతూ ఉంటాయి. కానీ.. వాస్తవానికి కొత్త పోర్టులు కడతాం.. కడతాం అని టైం పాస్ చేస్తూంటారు. ప్రైవేటు వ్యక్తులు ఎవరూ రారు.కానీ ఉన్న పోర్టులు మాత్రం చేతులు మారిపోతున్నాయి. కృష్ణపట్నం ,గంగవరం పోర్టులు అదానీ పేరు మీదకు మారిపోాయయి. గంగవరం పోర్టులో ఏపీకి ఉన్న పది శాతం వాటాను అతి తక్కువగా ఆరు వందల కోట్లకే అమ్మేశారు. నిజంగా అమ్మదల్చుకుంటే బహిరంగ వేలం వేస్తే.. రెండు వేల కోట్లకుపైగా వస్తాయన్న అంచనా ఉంది. భావన పాడు పోర్టు కూడా అదానీకే ఇవ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయించడంతో ఇక విశాఖ పోర్టును కూడా అలాగే చేస్తారన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి. అదానీది ప్రధానంగా పోర్టులు.. ఎయిర్‌పోర్టుల వ్యాపారం. పోర్టుల విషయంలో ఇప్పటికే పట్టు సాధించారు. చివరికి ఆంధ్రప్రదేశ్‌లోని అతి పెద్ద ప్రైవేటు పోర్టు కృష్ణపట్నం కూడా అదానీ చేతుల్లోకి వెళ్లిపోయింది. మరికొన్ని పోర్టులపైనా ఆయన గురి పెట్టారు. విశాఖలో 130 ఎకరాలను అదాని డేటా సెంటర్ కుఇచ్చారు. ఇక్కడ ఎకరం ఐదు నుంచి పది కోట్లు ఉంటుంది. అసలు కంపెనీ పెట్టకుండానే సేల్ డీడ్ రాసిచ్చేశారు. ఇప్పుడా స్థలం విషయంలో పెద్ద స్కాం ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. అదాని డేటా సెంటర్ పెడతారో లేదో ఎవరికీ తెలియదు. ఇక అదానీ గ్రీన్ ఏపీలో 60వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతుందని ఉదరగొడుతున్నారు. రెండు ప్రాజెక్టులను అదానీ గ్రీన్ ఎనర్జీ ఏర్పాటు చేయబోతోందని.. ఇందులో 3,700 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టుకాగా, 10వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు అని చెబుతున్నారు. ఇందు కోసం .. కొన్ని వేల ఎకరాలను అదానీ పరం చేయబోతున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు నడుస్తోంది.ఇప్పుడు వైజాగ్ స్టీల్‌లోనూ ఆయన పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారు. వైజాగ్ స్టీల్ అమ్మకానికి సంబంధించి జరిగే బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనాలని అదానీ గ్రూప్ చూస్తున్నట్టు సమాచారం. ఈ ఏడాది ఆఖర్లో వైజాగ్ స్టీల్ కోసం కేంద్రం బిడ్లను ఆహ్వానించే అవకాశాలూ కనిపిస్తున్నాయి. ఇవన్నీ బయటకు తెలిసినవి.. బయటకు తెలిసి.. మరో అతి కీలకమైన ఆస్తిని అదానీకి ప్రభుత్వం కట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది. అదే కృష్ణపట్నం విద్యుత్. కృష్ణపట్నంలోని 800 మెగావాట్ల చొప్పున సామర్థ్యం కలిగిన మూడు యూనిట్ల (మొత్తం 2,400 మెగావాట్లు) నిర్వహణ బాధ్యతలను అదానీ గ్రూపునకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ పవర్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ (ఏపీపీడీసీఎల్) ఇప్పటికే ప్రి-బిడ్ క్వాలిఫికేషన్ కోసం సంస్థలతో సంప్రదింపులు జరిపింది. ఎన్ని చేసినా చివరికి అదానీకే ఇస్తారని ఇప్పటికే స్పష్టమయింది.ఇక బయటకు తెలియకుండా.. రహస్యంగా ఎన్ని ప్రభుత్వ ఆస్తులు అదానీ పరం చేశారో ఎవరికీ తెలియదు. ప్రభుత్వం మారి పత్రాలన్నీ బయటకు వస్తే.. అసలు మొత్తం ఏపీలో ఆదానీకి ఎంత మేర కట్టబెట్టారో తెలుస్తోంది.
అమూల్, అదానీ పోను కొంత అస్మదీయుల కబ్జాలు !
ఆంద్రప్రదేశ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆస్తి గొడవలే. ప్రైవేటు ఆస్తుల సంగతి పక్కన పెడితే.. ప్రభుత్వ భూమి అన్నదాన్ని కనిపించనీయకుండా మాయం చేస్తున్నారు. సర్వేల పేరుతో ప్రభుత్వ భూమిని గుర్తించడం.. వెంటనే జెండా పాతేయడం కామన్‌గా మారుతోంది. వివాదాస్పద భూముల కేటగిరిలో పెట్టడం.. బేరం కుదుర్చుకుని మళ్లీ తీసేయడం అనేది ఇప్పుడో వ్యాపారం అయిపోయింది. విశాఖపట్నంలో .. వైఎస్ఆర్సీపీ నేతలు చేసిన కబ్జాల గురించి కథలు కథలుగా వెలుగులోకి వచ్చాయి. చివరికి పరిశ్రమల పేరుతో కేటాయించే భూముల్లోనూ బడా కంపెనీలకు పోను మిగిలినవనీ ఊరూపేరూ లేని బినామీ కంపెనీల జాబితాలోకే వెళ్తున్నాయి. కడపలో షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీకి ఎన్ని భూములు కట్టబెట్టారో లెక్కలేదు. అసలు ఈ కంపెనీ ఏం చేసింది.. ఎలాంటి వ్యాపారాలు చేసింది..అని ఆరా తీస్తే.. గట్టిగా ట్రాన్స్ ఫార్మర్లు తయారు చేసిన చరిత్ర కూడా లేదు. కానీ వేల కోట్లు పెట్టుబడి పెడుతుందని.. వందలు, వేల ఎకరాలు కేటాయిస్తున్నారు. నిన్నాగాక మొన్న కేబినెట్లోనే ఆ సంస్థ ఎనిమిది వేల కోట్ల పెట్టుబడి పెడుతుందని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇలా వైసీపీ నేతలు బినామీ కంపెనీలతో దోచుకున్న ఆస్తుల గురించి లెక్క తెలియాలంటే శ్వేతపత్రం ప్రకటించాలి లేదంటే ప్రభుత్వం మారాలి.
మిగిలింది కూల్చివేతలు – ఇందులో ప్రైవేటు.. ప్రభుత్వ ఆనే తేడా లేదు !
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి జేసీబీ పాలన అనే ముద్ర ఉంది. ఎందుకంటే కూల్చివేతలు తప్ప.. తమకేమీ తెలియదన్నట్లుగా వారి తీరు ఉంటోంది. పాలన చేపట్టగానే…తాము కూర్చున్న కొమ్మను నరుక్కున్న మాదిరిగా.. తాను తొలి సమావేశం పెట్టిన ప్రజా వేదికనే .. తాను అందులోనే కూర్చుని.. కూల్చేయమని ఆదేశించారు.. ఘనత వహించిన సీఎం గారు. దానికి చప్పట్లు కొట్టారు.. సివిల్ సర్వీస్ లు చదువుతున్న పెద్దలు. కూల్చివేశారుకూడా. ఆ కూల్చివేతలతో ప్రారంభమైన ప్రస్థానం.. ఇప్పటికీ సాగుతూనే ఉంది. పేదల ఇళ్లపై పడుతూనే ఉంది. ప్రభుత్వ ఆస్తులనూ వదలకుండా కూల్చేస్తున్నారు. ప్రజాధనంతో కట్టిన ప్రజావేదిక ఎంత విలువైనదో.. ప్రజల ప్రైవేటు ఆస్తులూ అంతే విలువైనవి. కూల్చివేయడం తప్ప.. కట్టే ఉద్దేశమే ఉండదు. సాధారణంగా హైవేనే 120 అడుగులు ఉండదు..కానీ కూల్చి వేతల కోసం.. ఇప్పటం అనే గ్రామంలో 120 అడుగుల రోడ్డు వేస్తామని హడావుడి చేయడం దేనికి సంకేతం ?. నిర్మించడం కష్టం.. కానీ కూల్చివేయడం ఈజీ. ఈ ఈజీ మార్గానే సీఎం జగన్ ఎంచుకున్నారు. కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. సీఎం జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్ని కట్టారో.. చెప్పడం కష్టం. ఎందుకంటే కట్టింది ఒక్కటీ లేదు. చివరికి తన సొంత నియోజకవర్గం పులివెందులకు.. కనీసం ఐదారు వేల కోట్ల రూపాయల విలువైన పనులను జీవోల రూపంలో ఇచ్చారు..కానీ చివరికి ఘనంగా గ్రాఫిక్స్ రిలీజ్ చేసిన బస్టాండ్ ను కూడా కట్టలేకపోయారు. ఇప్పుడే.. ఓ రూపానికి వచ్చిన బస్టాండ్ ఫోటోలను చూపించి ఆ పార్టీ నేతలు చంకలు గుద్దుకుంటున్నారు. కానీ ఆ కాంట్రాక్టర్ బిల్లులు ఇవ్వడం లేదని ఎప్పుడు ఆపేస్తాడో.. చెప్పడం కష్టం. కానీ కూల్చివేతల గురించి చెప్పాలంటే… ప్రతీ ఊరిలో కూల్చివేతల ఆనవాళ్లు కనిపిస్తాయి. చివరికి పులివెందులలో కూడా. ఇందులో ప్రభుత్వ ఆస్తులు ఎన్ని ఉన్నాయో.. అంత కంటే ఎక్కువగా ప్రైవేటు ఆస్తులు ఉండటం… ్త్యంత విషాదకరం.
రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడిందే లేదు !
సీఎం జగన్ ఇలా రాష్ట్ర ఆస్తుల్ని అమ్ముతున్నారు.. తాకట్టు పెడుతున్నారు.. కూల్చేస్తున్నారు.. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం.. సంపద పెంపు కోసం ఎరప్పుడైనా ప్రయత్నించారా అంటే.. దుర్భిణీ పెట్టి వెదికినా ఒక్క సందర్భం కనిపించదు. పోలవరం ఆగిపోయింది.. రాజధాని మట్టి కొట్టుకుపోయింది. ప్రజల ఉపాధి నాశనం అయిపోయింది. అయినా పాలకుడు తొణకలేదు..బెణకలేదు. రాష్ట్ర విభజన అనంతరం రావాల్సిన లక్ష కోట్ల రూపాయల ఆస్తుల కోసం గత ప్రభుత్వం చేసిన పోరాటాన్ని కనీసం కొనసాగించలేదు. కలిసి పరిష్కరించేసుకుంటామని కేసీఆర్ చెప్పగానే.., సై అని కేసులు ఉపసంహరించుకున్నారు. సచివాలయ భవనాలు రాసిచ్చేశారు. కానీ నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు తెలంగాణ ఏమీ ఇవ్వడం లేదని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇంత కంటే.. దౌర్భాగ్యమైన పాలన ఉంటుందా ? రావాల్సిన ఆస్తుల కోసం … కేంద్రాన్ని సంప్రదించారా అంటే లేదు.. పోనీ ఆప్తమిత్రుడు కేసీఆర్‌ను అడిగారా అంటే అదీ లేదు. నేరుగా కోర్టు కేసుల్లో పడేలా చేశారు. ఇదంతా రాజకీయం చేసుకోవడమే కానీ.. రాష్ట్రానికి మేలు చేసే ఉద్దేశంతో కాదు.
ఏ రాజకీయ నాయకుడు అయినా ఓ సారి ముఖ్యమంత్రి అయితే.. తన పాలనలో ప్రజల జీవితాల్ని మార్పు చేసే ఓ గొప్ప పని చేయాలనుకుంటారు. కాని ఏపీలో మాత్రం రివర్స్.. ఏడాదికి ఓటు బ్యాంక్‌కు అకౌంట్లో ఓ పదో.. ఇరవై వేలో వేసి.. అద్భుతమైన పని చేశానని సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. ఈ పది..ఇరవై వేలు ఇవ్వడానికి లక్షల కోట్ల అప్పులు… ప్రజల జీవితాలపై నిప్పులు…!