స్టీల్ ప్లాంట్ రివైవల్ కోసం కేంద్రం రూ. 11వేల కోట్లకుపైగా ప్యాకేజీని ప్రకటించింది. అంతకుముందు బీఎస్ఎన్ఎల్ వంటి సంస్థలకు కూడా వేల కోట్లు ప్రకటించింది. ఇదంతా ప్రజాధనమే. ఆయన సంస్థల్లో పోసినంత మాత్రాన లాభాల్లోకి వస్తాయని.. బాగుపడతాయని ఎవరూ అనుకోవడం లేదు. ఆ డబ్బులన్నీ కరిగిపోతాయి. మళ్లీ దివాలా అంచుకు వస్తాయి. మళ్లీ ప్రజాధనం పోయాల్సిందే. ఇదంతా ఎందుకు.. వాటిని ప్రైవేటు పరం చేస్తే అద్భుతంగా నడిపించుకుని లాభాల బాట పట్టిస్తారు. కానీ .. సెంటిమెంట్ పేరుతో.. రెచ్చగొడతారు. ఉద్యోగులు ప్రైవేటుకు ఇస్తే ఎక్కడ పని చేయాల్సి వస్తుందోనని ఉద్యమాలకు దిగుతారు. ఇదే అసలు సమస్య.
ప్రైవేటీకరణ అంటే మూసివేయడం కాదు !
స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తామనగానే రాజకీయం రోడ్ల మీదకు వచ్చేసింది. ఉద్యోగులు ధర్నాలు చేశారు. అదో సెంటిమెంట్ అయింది. కేంద్ర మంత్రి చెప్పిన దాని ప్రకారం స్టీల్ ప్లాంట్ కు 35 వేల కోట్ల రూపాయల నష్టాలున్నాయి. ఇలాంటి సంస్థ ఎంత కాలం మనుగడ సాగించగలదు ? ఎన్ని వేల కోట్లు ప్రజాధనం ఆ సంస్థకు ధారబోస్తే మనుగడ సాగిస్తుంది…?. దాని వల్ల వచ్చే మేలు ఎంత అనేది ఎవరూ చెప్పరు. కానీ ప్రైవేటీకరణ అంటే మూసివేయడం అన్నట్లుగా ప్రచారం చేసి ప్రజల్లో భావోద్వేగాలు పెంచుతారు. దీని వల్ల ఆ సంస్థ మనుగడకే నష్టం కానీ.. మేలుకు కాదు. ప్రైవేటీకరణ అంటే.. మూసివేయడం కాదు.. ఆ సంస్థను కాపాడేందుకు చేస్తున్న ఆఖరి ప్రయత్నం అనుకోవచ్చు.
పని చేయాల్సి వస్తుందనే ఉద్యోగుల ఆందోళనలు !
పీఎస్యూల్లో పని చేసే ఉద్యోగులు ప్రైవేటీకరణ అంటే ఎందుకు వద్దంటారు?. దేశంలో 90 శాతానికిపైగా జీతాలు తీసుకునేవారు ప్రైవేటు సంస్థల్లోనే పని చేస్తున్నారు. వారందరికీ లేని అభద్రతా.. ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసే వారికే ఎందుకు?. ఎందుకంటే.. ప్రైవేటు పరం చేస్తే.. వాళ్లు పని చేయాల్సి వస్తుంది. స్టీల్ ప్లాంట్ నే తీసుకుంటే.. అందులో కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఇతర ఏజెన్సీల నుంచి తీసుకున్న వారే అసలు పని చేస్తారు కానీ.. ఉద్యోగులు చేసే పని చాలా తక్కువ. బీహెచ్ఈఎల్ లాంటి సంస్థల్లోనూ.. ఇంటర్నీలు.. ట్రైనీలు.. కాంట్రాక్ట్ ఉద్యోగులతోనే బండి నడిపిస్తారు. అసలు ఉద్యోగులు టైంపాస్ చేస్తూంటారు. ఇది చేదుగా అనిపించినా పచ్చి నిజం. ప్రైవేటీకరణ చేస్తే వారితో పనులు చేయించుకుంటారని వారు ధర్నాలు చేస్తూంటారు.
అప్పట్లో పారిశ్రామీకీకరణ అవసరం – ఇప్పుడేముంది?
స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో దేశానికి పారిశ్రామికీకరణ అవసరం. పెట్టుబడులు పెట్టేవారు లేరు. ప్రభుత్వమే పెట్టాల్సి వచ్చింది. పెట్టింది. తన బాధ్యతను నిర్వర్తించింది. ఇప్పుడు ప్రభుత్వం కంపెనీలను నడపాల్సిన పరిస్థితుల్లో లేదు. ప్రైవేటు పెట్టుబడులు.. అత్యధిక సామర్థ్యంతో పని చేసి ఉత్పాదకత పెంచే ఆలోచనలతో ముందుకు వస్తున్నాయి. వాటి భాగస్వామ్యాన్ని ఆహ్వానించడం తప్పేమీ కాదు. కానీ ప్రైవేటీకరణ అంటే.. అదేదో భూతమన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. దేశంలో 90శాతానికిపై ప్రవేటు రంగంలోనే ఉపాధి పొందుతున్నారు. అది కల్పతరువు. అందుకే ప్రభుత్వం ప్రజధనాన్ని ప్యాకేజీల రూపంలో వృధా చేయడం కన్నా.. ప్రైవేటీకరణ చేయడానికే ప్రాధాన్యం ఇవ్వాలి. అదే ప్రజాధనానికి సరైన గౌరవం ఇచ్చినట్లు.