అసెంబ్లీ వ్యవహారాలపై తప్పుడు సమాచారాన్ని ప్రచురిస్తూ.. సభా గౌరవాన్ని కించపరుస్తున్న సాక్షి మీడియాపై అసెంబ్లీ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రివిలేజ్ నోటీసులు జారీ చేయనున్నారు. ఎమ్మెల్యేల శిక్షణా శిబిరాలు జరగకపోయినా కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారని స్పీకర్ పై అవినీతి ఆరోపణలు చేశారు. ఈ కథనాలపై అయ్యన్నపాత్రుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. స్పీకర్ చైర్ ను అవమానపరుస్తున్నారని.. తప్పుడు కథనాలతో బురద చల్లుతున్నారని మండిపడ్డారు. సభ్యులు కూడా ఇదే అంశంపై చర్యలు తీసుకోవాలన్నారు.
ఇలాంటి అసత్యకథనాలను ఉపేక్షించరాదని.. సభా హక్కుల కమిటీకి సిఫారసు చేస్తున్నట్లుగా ప్రకటించారు. అందుకే ఈ కథనాల విషయంలో సభ్యుల నిర్ణయం మేరకు కఠిన చర్యుల తీసుకోవాలని నిర్ణయించారు. సభా హక్కుల కమిటీ నిర్ణయం మేరకు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. సభలో గవర్నర్ ప్రసంగం సందర్శంగా జగన్ తో పాటు ఇతరులు చాలా కొద్దిసేపే అసెంబ్లీలో ఉన్నారు. గవర్నర్ ప్రసంగిస్తున్నప్పుడు నినాదాలు చేస్తూ పేపర్లు చింపి పారేస్తూ వాకౌట్ చేశారు. అయితే సాక్షిలో మాత్రం లేనిపోనివన్నీ రాశారు.
సాక్షిలో వచ్చిన కథనాలు ఎంతగానో బాధించాయని .. ఫేక్ న్యూస్ పై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని కూటమి సభ్యులు నిర్ణయించారు. సభలో జరిగిన పరిణామాలు.. జగన్ వ్యవహరించిన తీరుపై స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇలా వ్యవహరిస్తాడని అనుకోలేదన్నారు. పక్కనే బొత్స లాంటి సీనియర్ నేత ఉన్నా పట్టించుకోలేదని మండిపడ్డారు. సభలో వైసీపీ వ్యవహరించిన తీరును ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు.