ఇది వరకు కొన్ని కథల్ని తెరపైకి తీసుకురావడానికి భయపడేవారు. ఇది ఆడుద్దా..? ఈ జోనర్ చూస్తారా? అనే అనుమానాలు ఉండేవి. ఓటీటీ వచ్చాక.. ‘కాదేది కథకు అనర్హం’ అయిపోయింది. ఓటీటీ బడ్జెట్లు అందుబాటులో ఉండడం, స్టార్లు ఉత్సాహం చూపించడంతో.. కొన్ని క్రేజీ కథలు సినిమా వస్తువులుగా మారిపోతున్నాయి. ఓ సాధారణ మధ్యతరగతి గృహిణి.. అనుకోకుండా ఓ హత్య చేస్తుంది. దాన్నుంచి తనని తాను కాపాడుకోవడానికి పడే శ్రమంతా.. తెరపై తీసుకురావాలి.. అంటే – ‘ఇలాంటి కథలు ఓటీటీకి పర్ఫెక్ట్’ అనేస్తున్నారు. అందుకే…ఈ కథతో తయారైన `భామాకలాపం` ఓటీటీకి వచ్చేసింది. ప్రియమణి ప్రధాన పాత్రధారి కావడం, ‘డియర్ కామ్రేడ్’ దర్శకుడు భరత్ కమ్మ ఈ చిత్రాన్ని రూపొందించడం, ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండడం… ఇవన్నీ ‘భామ..’పై ఫోకస్ పెంచాయి. మరి.. ఈ ఓటీటీ వంటకం కుదిరిందా, లేదా? వంటకు కావల్సిన దినుసులు సమకూరాయా, లేదా? చూస్తే….
బెంగళూరు మ్యూజియంలో ఓ గుడ్డు మాయం అవుతుంది. ఆ గుడ్డు ఓ యాంటిక్ పీస్. దాని విలువ సుమారు 200 కోట్లు. ఆ గుడ్డు కాస్త అటు తిరిగి, ఇటు తిరిగి… హైదరాబాద్‌లోని ఓ అపార్ట్మెంట్కి చేరుతుంది. అక్కడే అనుపమ (ప్రియమణి) ఉండేది. తను ఓ సాధారణ మధ్యతరగతి గృహిణి. టైమ్ పాస్ కోసం.. యూ ట్యూబ్‌లో వంట పోగ్రామ్ చేస్తుంటుంది. ‘అనుపమ.. ఘుమఘుమ’.. చాలా ఫేమస్. అనుపమకి మరో మహా చెడ్డ అలవాటు ఉంది. ఆ అపార్ట్మెంట్లో ఎవరింట్లో ఏం జరుగుతోందో తెలుసుకోవడం మహా సరదా. ఓ రకంగా.. తను ఆ అపార్ట్మెంట్ కి లేడీ డిటెక్టీవ్ అన్నమాట. అయితే ఆ అలవాటే కొంప ముంచుతుంది. తన అత్యుహాంతో ఓ ఇంట్లో చొరబడి ఏం జరుగుతోందో తెలుసుకునే ఆరాటంలో.. ఎవరైతే 200 కోట్ల గుడ్డు కోసం వెదుకుతున్నాడో.. అతన్ని చంపేసి, ఆ శవాన్ని ఇంట్లో దాచి పెడుతుంది. ఆ తరవాత.. మొదలవుతాయి… కుస్తీబట్లు. ఇంతకీ ఆ 200 కోట్ల గుడ్డు ఎవరికి చిక్కింది..? ఈ హత్య కేసు నుంచి.. అనుపమ ఎలా తప్పించుకుంది.. అనేదే మిగిలిన కథ.
నిజానికి ఇది చాలా అసంబద్ధమైన కథ. తనకు సంబంధం లేని విషయంలో అనవసరంగా వేలు, కాలు, కన్నూ పెట్టి… ఏకంగా ఓ మర్డరే చేసేసే గృహిణి కథ. అనుకోకుండా.. ప్రాణ రక్షణకు ఓ హత్య చేసి (దృశ్యం టైపు) అందులోంచి తనని తాను కాపాడుకోవడం.. నిజంగానే ఓ మంచి కాన్సెప్ట్. కాకపోతే.. ఇక్క కెలుక్కుని మరీ… ఆపదలో చిక్కుకున్న బేరంలా కనిపిస్తుంది. దాంతో.. ప్రధాన పాత్రపై సింపతీ పోయి.. చిరాకు అసహనం కలుగుతాయి. అది పెద్ద మైనస్ గా మారింది. అనుపమని సాధారణ గృహిణిలా చూపిస్తూనే, తన క్రైమ్ తెలివితేటలు బయటపెట్టడం.. సహేతుంగా లేదు. నిజంగా ఓ ప్రొఫెషనల్ కిల్లర్ లా ఆలోచించే విధానం ఏమాత్రం అతకదు. అందుకనేనేమో ఈ సినిమాలో ఓ డైలాగ్ కూడా రాసుకున్నారు. ‘మన కంటే వయలెంట్ గా ఉంది ఈ చిలక’ అని విలన్ చేతే అనుపమ పాత్రని ఎలివేట్ చేయించారు.
విలన్ అంటే గుర్తొచ్చింది. తను విలనా..? జోకరా? అనిపిస్తుంది. 200 కోట్ల విలువైన గుడ్డు ని పోగొట్టుకుని కామెడీ చేస్తుంటాడు. విలనే.. సీరియస్ గా లేకపోతే… ఇక ఆడియన్స్ ఈ కథని, సన్నివేశాల్ని సీరియస్‌గా ఎలా పట్టించుకుంటాడు..? విలన్ పాత్రని మరీ జోకర్ గా చేసేస్తున్నానేమో అనే అనుమానం దర్శకుడికీ వచ్చి ఉంటుంది. అందుకే ఓ చోట ‘కామెడీ అనుకున్నావా.. ఇది సీరియస్’ అని చెప్పించి… అందులోనే విలనిజం వెదుక్కోమంటాడు. దానికి తోడు బైబిల్, పాస్టర్, క్రైస్తవం… ఈ అంశాలు మరీ ఇబ్బంది పెడతాయి. ఓ ముస్లిం అమ్మాయి… బుర్ఖా వేసుకుని మరీ… చర్చికి వెళ్లడం ఏమిటి? క్రైస్తవమతం నమ్మడ మేమిటి? మతంతో లింకులు పెట్టకుండా కూడా ఆయా సన్నివేశాలు తీయొచ్చు. కానీ దర్శకుడు అలా ఆలోచించలేకపోయాడు. మతం మత్తులో పడి.. జనాలు మర్డర్లు చేస్తారన్న సందేశం ఇస్తున్నాడా? చివర్లో… మతం, దేవుడు, మానవత్వం అంటూ ఓ పెద్ద క్లాసు పీకి.. శుభం కార్డు వేశాడు. కానీ… ఈలోగా జరగాల్సిన అకృత్యాలు జరిగిపోతాయి. గర్భిణీ అయిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ని చంపడం.. ఈ కథకు అవసరం లేదు. తను బతికితే… ప్రధాన పాత్రకు ఇబ్బంది అని దర్శకుడు భావించి ఉంటాడు. మెయిన్ లీడ్ ని సేఫ్ చేయడానికి ఈ మార్గం ఎంచుకున్నాడంటే… అది కచ్చితంగా స్క్రిప్టు లోపమే.
ప్రియమణి లాంటి నటి ఉండబట్టి 2 గంటల 10 నిమిషాల ఈ ప్రహసనాన్ని కాస్త అయినా భరించగలిగాం. కథ ఎలా ఉన్నా… వయసుకి తగిన పాత్రని ఎంచుకున్నందుకు ప్రియమణిని అభినందించాలి. కాకపోతే.. ఇలాంటి పాత్రలతో ఏ విషయం కన్వే అవ్వబోతోందన్న ఊహ.. ప్రియమణికి ఈ స్క్రిప్టు వినేటప్పుడే వచ్చి ఉంటే బాగుండేది. జాన్ విజయ్ ప్రతినాయకుడిగా నటించాడు. తన డబ్బింగ్ బాగా ఇబ్బంది పెట్టింది. హాలీవుడ్ వెబ్ సిరీస్ లకు తెలుగులో డబ్బింగ్ చెప్పినట్టు అనిపించింది. ఆ పాత్రని సైతం సరిగా డిజైన్ చేయలేదు. శరణ్య ప్రదీప్… పనమ్మాయిగా నటించింది. అనుపమ చేసే మర్డర్‌కి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సాయం చేసేది ఆ పాత్రే. మిగిలినవాళ్లవి చిన్న చిన్న పాత్రలే. దర్శకుడు కరుణ కుమార్ ఓ చిన్న పాత్రలో మెరుస్తాడు.
ఒక అపార్ట్మెంట్ చుట్టూ నడిచే కథ ఇది. రియల్ లొకేషన్ కాబట్టి.. ఆయా సన్నివేశాలన్నీ సహజంగా వచ్చాయి. జస్టిన్ ప్రభాకరన్ నేపథ్య సంగీతం కథ మూడ్ కి తగ్గటు సాగింది. కెమెరా వర్క్కూడా ఓకే అనిపిస్తుంది. బాగా ఖర్చు పెట్టాల్సి తీయాల్సిన సినిమా కాదు. బడ్జెట్ పరిమితుల్లోనే పూర్తి చేశారు. కథలో, క్యారెక్టరైజేషన్లో బలమైన లోపం ఉంది. ఓ ఖరీదైన గుడ్డు కోసం ఓ ముఠా వెదుక్కుంటూ రావడం, అది.. ఓ గృహిణికి చిక్కడం వరకూ బాగానే ఉండేది. కానీ దాని చుట్టూ మర్డర్లు జరగడం.. ఆ హత్యలో ప్రధాన పాత్ర భాగం కావడం, అదేదో యాక్సిడెంటల్ హత్యలా కాకుండా అనుభవం ఉన్న కిల్లర్ లా.. ప్రధాన పాత్రని తీర్చిదిద్దడం ఇవన్నీ కథని బలహీనంగా మార్చేశాయి. చివరికి బాగా కుదరాల్సిన వంటకాన్ని..నానా దినుసులు వేసి.. కలగాపులగం చేసేశాయి.
ఫినిషింగ్ టచ్: గుడ్డు పగిలింది