ఓ చిన్న వీడియోతో పాపులర్ అయిపోయింది ప్రియావారియర్. అయితే తను కథానాయికగా చేసిన తొలి సినిమానే బోల్తా కొట్టేసింది. దాంతో ప్రియావారియర్ క్రేజ్ అక్కడితో పరిసమాప్తం అనిపించింది. ఇప్పుడు నితిన్ సినిమాలో ఆఫర్ దక్కించుకుని – తెలుగులో తన సినిమాల ఖాతా తెరిచేసింది. ఈ సినిమాతో ప్రియాకి మరిన్ని మంచి అవకాశాలు వస్తాయన్న ఆశాభావం వక్యం అవుతోంది. అయితే ఇందులో ప్రియావారియర్కి అంత సీన్ లేదని టాక్. ఆమె స్ర్కీన్ టైమ్ 20 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉండదని తెలుస్తోంది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన కథానాయిక. రెండో నాయికగా ప్రియా వారియర్ అనుకుంటున్నారంతా. కానీ.. ప్రియా వారియర్ పాత్ర సెకండ్ హీరోయిన్ కంటే చిన్నదే అని తేలింది. కాకపోతే.. కనిపించిన ఆ కాసేపూ.. ప్రియ అల్లరి ఆకట్టుకుంటుందట. దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి ఆ పాత్రని అలా డిజైన్ చేసి పెట్టుకున్నాడట. చంద్రశేఖర్ ఏలేటి సినిమాల్లో ఏ పాత్రా అప్రధాన్యంగా ఉండదు. ప్రతీదీ విలువైనదే. అందుకే ప్రియ కనిపించేది కాసేపే అయినా – తనదైన ముద్ర వేసే ఛాన్స్ ఉంది. మరి ఈ అవకాశాన్ని ప్రియా వారియర్ ఎంత వరకూ సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి.