ఇది వెబ్ సిరీస్‌ల కాలం. మెల్లమెల్లగా తెలుగు ప్రేక్షకులూ దానికి అలవాటు పడుతున్నారు. లాక్ డౌన్ వేళ… థియేటర్లు మూసేసిన కాలంలో.. వెబ్ సిరీస్‌లే కాలక్షేపాన్ని అందించాయి. భాషతో సంబంధం లేకుండా వెబ్ సిరీస్‌లకు ఆదరణ పెరిగింది. పరాయి వెబ్ సిరీస్‌లనూ… సబ్ టైటిల్స్ తో చూడడం అలవాటు చేసుకున్నారు తెలుగు ప్రేక్షకులు. దాంతో వెబ్ సిరీస్‌లోని మజా తెలిసొచ్చింది.
తెలుగులోనూ చాలా వెబ్ సిరీస్‌లు వచ్చాయి. వస్తున్నాయి. అందులో సత్తా ఉన్నవి చాలా తక్కువ. దాంతో తెలుగు వెబ్ సిరీస్‌లపై ఆసక్తి కూడా పోతోంది. ఈనేపథ్యంలో తెలుగులో వచ్చిన మరో వెబ్ సిరీస్ `లూజర్` మాత్రం ఆకట్టుకుంటోంది. ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించిన వెబ్ సిరీస్ కావడంతో – దీనిపై తెలుగు జనాల దృష్టి పడింది. పైగా అన్నపూర్ఱ స్డూడియోస్ సంస్థ నిర్మించింది. అన్నపూర్ణ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందిన అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించారు. షాయాజీషిండే లాంటి పేరున్న నటీనటులు తెరపై కనిపించడంతో నిండుదనం వచ్చింది.
ప్రియదర్శిపై ఉన్న కమెడియన్ ముద్ర ఈ వెబ్ సిరీస్‌తో తొలగిపోవడం ఖాయం. సూరిగా తన నటన చూస్తే… తనలో ఎంత సీరియస్, సిన్సియర్ నటుడున్నాడో అర్థం అవుతుంది. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే వెబ్ సిరీస్ ఇది. పది ఎపిసోడ్లున్నాయి. ఎమోషన్స్‌తో పాటు హ్యూమన్ యాంగిల్‌ని బాగా చూపించగలిగాడు దర్శకుడు. సంభాషణలూ ఆకట్టుకున్నాయి. పది ఎపిసోడ్లూ పట్టుగా సాగాయి. తెలుగులో మంచి క్వాలిటీతో తెరకెక్కిన వెబ్ సిరీస్ ఇది. వ్యూవర్ షిప్ కూడా బాగుంది. దానికి తోడు సోషల్ మీడియాలో ఈ వెబ్ సిరీస్‌కి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ వెబ్ సిరీస్‌తో.. అభిలాష్ రెడ్డికి సిల్వర్ స్క్రీన్‌కి దారి దొరికినట్టైంది. త్వరలోనే అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.