కమెడియన్లు చాలామంది హీరోలుగా మారారు. మారుతున్నారు. అయితే సక్సెస్ రేటు తక్కువ. ప్రియదర్శి మాత్రం తన కెరీర్ని చాలా ప్లాన్డ్ గా ముందుకు తీసుకెళ్తున్నాడు. కమెడియన్ గా సినిమాలు చేస్తూనే, మధ్యమధ్యలో ‘బలగం’, ‘మల్లేశం’ లాంటి బలమైన కథల్ని ఎంచుకొంటున్నాడు. నాని నిర్మాతగా తీసిన ‘కోర్ట్`లోనూ తనే హీరో. అలా రెండు పడవల ప్రయాణం సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నాడు. తన దృష్టి ఇప్పుడు ఓ బయోపిక్ పై పడింది. శాంతా బయోటెక్ ఫౌండర్ వర ప్రసాద్ బయోపిక్ చేయాలని ఉందన్న ఆలోచనని వక్యం చేశాడు. వర ప్రసాద్ ది చాలా స్ఫూర్తివంతమైన గాథ. సినిమాకు కావల్సిన ముడిసరుకులు ఉన్న కథ. కాబట్టి ప్రియదర్శి మంచి రూట్ లోనే ఉన్నాడనిపిస్తోంది. ఈ కథ ప్రియదర్శి దగ్గరకు ఆల్రెడీ వచ్చేసిందని, అందుకే ఇప్పుడు ఇలా బయటపడి ఉండొచ్చని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. కాస్త ప్లాన్డ్ గా తీసుకొంటే పాన్ ఇండియా స్థాయిలో ఈ కథని కేటర్ చేయొచ్చు.
మొన్నామధ్య విడుదలైన ప్రియదర్శి `డార్లింగ్` సినిమా ఫెయిల్ అయ్యింది. ఈ సినిమాపై ప్రియదర్శి చాలా ఆశలు పెట్టుకొన్నాడు. కానీ వర్కవుట్ కాలేదు. ”డార్లింగ్ సినిమా ఫ్లాప్ అవ్వడం నిరాశ కలిగించింది. నిజానికి మంచి కథ. చాలా నమ్మాను. స్క్రీన్ ప్లే పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకొంటే బాగుండేది. కానీ సినిమా విడుదల అయ్యాకే ఆ విషయం మాకు అర్థమైంది. సినిమా మా చేతుల్లోంచి వెళ్లిపోయాక ప్రేక్షకులే న్యాయ నిర్ణేతలు. వాళ్ల జడ్జిమెంట్ గౌరవించాల్సిందే. ఇక మీదట అలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడతా” అని చెప్పుకొచ్చాడు ప్రియదర్శి. ‘కోర్ట్’ ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అంతకుముందే స్పెషల్ ప్రీమియర్స్ ప్లాన్ చేశారు.