తెలుగు చిత్రసీమలో ఉన్నంతమంది హాస్య నటులు ఎక్కడా లేరు. వాళ్లలో కొంతమంది హీరోలుగానూ రాణించారు. కమెడియన్ హీరో అవ్వడం.. ఎప్పటి నుంచో ఉన్న ట్రెండే. హాస్య నటులు ఈ ట్రెండ్ ని ఫాలో అవుతూ విజయాలు దక్కించుకొంటున్నారు. ఈ జమానాలో అయితే.. ప్రియదర్శి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రియదర్శిది కామెడీలో సెపరేట్ ట్రెండ్. ‘పెళ్లి చూపులు’ సినిమాతో బాగా పాపులర్ అయి, ఆ తరవాత.. ఆ క్రేజ్ ని నిలబెట్టుకొంటూ, కమెడియన్లలో బిజీ స్టార్ గా మారాడు. ప్రియదర్శి కామెడీ టైమింగ్ విభిన్నంగా ఉంటుంది. ఆ మార్క్ తోనే వరుసగా అవకాశాలు అందిపుచ్చుకొన్నాడు. హీరోగానూ మెరిశాడు. ‘జాతి రత్నాలు’లో హీరోకి తగ్గని పాత్ర చేశాడు. హృద్యమైన కథతో తెరకెక్కించిన ‘మల్లేశం’లో మెప్పించాడు. ఇప్పుడు ‘బలగం’తోనూ ఓ హిట్టు కొట్టాడు. నిజానికి మల్లేశం, బలగం చిత్రాలు ప్రియదర్శి ఇమేజ్‌కీ, తన కామెడీ టైమింగ్ కి అస్సలు సూట్ కాని సినిమాలు. కానీ.. నటుడిగా తాను అవి కూడా చేయగలని ప్రూవ్ చేసుకొన్నాడు. అలాగని తనకు పేరు తీసుకొచ్చిన కామెడీ వేషాల్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయడం లేదు. యేడాదికి హీరోగా ఓ సినిమా చేసి, మిగిలినవన్నీ.. కామెడీ వేషాలతోనే బండి నడిపించేయాలని భావిస్తున్నాడు ప్రియదర్శి. ఇప్పుడు హీరోగా రూ.2 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నట్టు టాక్. `బలగం` కూడా హిట్టయ్యేసరికి. మనోడికి డిమాండ్ బాగా పెరిగిపోయింది. సునీల్ హీరోగా టర్న్ తీసుకొన్న తరవాత.. హీరో పాత్రలకే పరిమితం అయ్యాడు. ఆ తరవాత.. హీరోగా ఫామ్ కోల్పోయినప్పుడు కామెడీ జోన్లోకి ఈజీగా వచ్చేశాడు. కానీ.. ప్రియదర్శి మాత్రం.. కామెడీ, హీరోయిజం రెండూ ఒకేసారి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.