క్లాస్ సినిమాల దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొన్నారు ఇంద్రగంటి మోహన కృష్ణ. ఇప్పుడాయన హాస్య నటుడు ప్రియదర్శి హీరోగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీనికి ‘సారంగపాణి జాతకం’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈరోజు ప్రియదర్శి పుట్టిన రోజు. ఈ సందర్భంగా టైటిల్ రివీల్ చేస్తూ, ఫస్ట్ లుక్‌ని కూడా విడుదల చేశారు. రూప కొడువాయూర్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. శివలంక కృష్ణ ప్రసాద్ నిర్మాత. దాదాపు 90 శాతం షూటింగ్ పూర్తయ్యింది. వివేక్ సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు.
జాతకాల పిచ్చి ఉన్న యువకుడిగా ప్రియదర్శి కనిపించనున్నాడు. మనిషి జీవితం చేతి రేఖలపై ఆధార పడి ఉంటుందా? చేతల్లో ఉంటుందా? అనే విషయాన్ని వినోదాత్మకంగా చూపిస్తున్నారు ఇంద్రగంటి. మరోవైపు ‘బలగం’ హిట్ తరవాత ప్రియదర్శి రూటు మారిపోయింది. తాను హీరోగా ఫుల్ బిజీ అయిపోయాడు. చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ఇటీవల ‘డార్లింగ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా సరిగా ఆడలేదు. అయినా ప్రియదర్శి కెరీర్‌పై ఎలాంటి ప్రభావం పడలేదు. తన డేట్లు కావాలంటే కనీసం యేడాది పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఒక్కో సినిమాకూ దాదాపు రూ.2 కోట్ల పారితోషికం అందుకొంటున్నాడట.