మీరు నా బొమ్మలు వాడతారా? అంటూ ‘అంగుళీక’ దర్శక, నిర్మాతలపై ప్రియమణి ఘాటు కారాలు మిరియాలు నూరుతోంది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండంటూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) మెట్లు ఎక్కింది. ప్రియమణికి ఎందుకంత కోపం అంటే? ఇటీవల ‘అంగుళీక’ టీజర్ విడుదల చేశారు. సూర్యగ్రహణం ఘడియల్లో విడిపోయిన ప్రేమజంట మళ్లీ సూర్యూడి ఆశీస్సులతో 585 ఏళ్ల ఎలా కలుసుకున్నారనే కథతో తెరకెక్కిన చిత్రమిది. 585 ఏళ్ల తర్వాత ప్రేమజంట కలుసుకోవడం మాట ఏమో గానీ… ఇది ఐదేళ్ల క్రితం సినిమా. ‘అరుంధతి’లో అనుష్కను పెళ్లి చేసుకోబోయేవాడిగా నటించిన దీపక్ ఇందులో హీరో… ప్రియమణి హీరోయిన్… సినిమాకి కొబ్బరికాయ కొట్టినప్పుడు. షూటింగ్ చేసిన కొన్ని రోజులకు ప్రియమణి ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారట. తర్వాత వేరే హీరోయిన్ తో సినిమా కంప్లీట్ చేశారట. ఇటీవల విడుదలైన టీజర్ చూస్తే అందులో ప్రియమణి వున్నారు. దర్శక, నిర్మాతలు కూడా ప్రియమణి స్టిల్స్ మీడియాకు పంపారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారామె. “సినిమా నేను చేయకున్నా… ప్రచార కార్యక్రమాల్లో నా ఫోటోలు ఉపయోగిస్తున్నారు. అందుకోసం వాళ్ళు నాకు కంపెన్సషన్ పే చేయాలి” అని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)కి ఇచ్చిన కంప్లయింట్ లో ప్రియమణి పేర్కొన్నారు. ఈ పంచాయితీ ఎప్పుడు సెటిల్ అవుతుందో?