పెళ్లయిన కొత్తలో మాంచి పాపులారిటీ ఉండేది ప్రియమణికి. అంటే, పెళ్లయిన కొత్తలో సినిమా తర్వాత ఆమెకు బోలెడు ఆఫర్లు వచ్చాయి. అందానికి అందం, నటించే టాలెంట్ ఉన్నప్రియమణి తెలుగులో తారాపథంలోకి రివ్వున దూసుకుపోయి టాప్ హీరోయిన్లకు పోటీ ఇస్తుందనుకున్నారు. రాను రానూ సీన్ మారిపోయింది. టాలీవుడ్ లో ఇతర హీరోయిన్లు హవా చెలాయిస్తుంటే ప్రియమణి డిమాండ్ తరిగిపోతూ వచ్చింది. ద్రోణ సినిమాలో మితిమీరి అందాలు ఆరబోసినా బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. సక్సెస్ లు తగ్గిపోయి చాన్స్ లు కూడా తగ్గాయి. ఈమధ్య బాలీవుడ్ లో తళుక్కుమంది. అదేనండీ, చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో షారూఖ్ తో కలిసి ఐటం సాంగ్ లో దుమ్మురేపింది.
తెలుగులో ఈ ఏడాది ప్రియమణికి ఒక్క సినిమా కూడా లేదు. అంగుళిక తర్వాత అడ్రస్ లేదు. వరసగా కన్నడ సినిమాలే చేస్తూ పోతోంది. ఈ ఏడాది చేసిన రెండూ కన్నడ చిత్రాలే. ఏమాటకామాట. తెలుగు సినిమా అయితే రేంజి ఎక్కువ. ప్రేక్షకుల సంఖ్య ఎక్కువ. రెమ్యునరేషన్ కూడా చాలా ఎక్కువ. కన్నడ సినిమాలైతే ఈ అన్ని విషయాల్లోనూ కాస్త తక్కువే, అందుకే కన్నడ సినిమాలు చేస్తూనే తెలుగులో ఆఫర్లు సంపాదించాలని ప్రియమణి భావిస్తోందట. కానీ ఎందుకో ఆమెకు తెలుగు నిర్మాతల నుంచి పిలుపు రావడం లేదట. అయినా ఏదో ఒక రోజు మల్లీ టాలీవుడ్ ను ఏలుతుందని ప్రియమణి అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.