మహేష్ బాబు – రాజమౌళి కాంబోలో రూపుదిద్దుకొంటున్న చిత్రంలో కథానాయికగా ప్రియాంకా చోప్రాని ఎంచుకొన్నారన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ ప్రియాంకా హైదరాబాద్ లో దిగిపోయింది. రాజమౌళి అండ్ టీమ్ కు ప్రియాంకా లుక్ టెస్ట్ కూడా ఇచ్చిందని సమాచారం అందుతోంది. ప్రియాంకా కథానాయికగా ఎంపికవ్వడం దాదాపుగా ఖాయమే. అయితే ఇప్పుడు ఈ నిర్ణయం ప్రియాంక చేతుల్లోనే వుంది. ఎందుకంటే రాజమౌళి ప్రియాంకను బల్క్ డేట్లు అడుగుతున్నార్ట. యేడాది మొత్తం ఒకే సినిమాకు ఇవ్వడం ప్రియాంకా లాంటి స్టార్ కథానాయికలకు కష్టమైన విషయమే. పైగా ప్రియాంక ఇప్పుడు బాలీవుడ్, హాలీవుడ్ అంటూ తెగ తిరిగేస్తోంది. హాలీవుడ్ అవకాశాలపై గట్టిగా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో రాజమౌళి సినిమాకు గంపగుత్తగా డేట్లు ఇవ్వగలదా, లేదా? అనేది ఆసక్తిని కలిగిస్తోంది. రాజమౌళి సినిమా అంటే ఇప్పుడు హాలీవుడ్ రేంజే. మహేష్ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు రాజమౌళి. అలాంటప్పుడు ప్రియాంక పెద్దగా ఆలోచించాల్సిన పరిస్థితి లేదు. కాకపోతే.. సదరు డేట్లు ముందే ఎవరికైనా అలాట్ చేస్తే మాత్రం ఇబ్బంది ఎదురవుతుంది.
ప్రియాంక అనే కాదు. ఈ సినిమాలో నటించే నటీనటులందరి డేట్లు రాజమౌళి బల్క్ గానే అడుగుతున్నార్ట. కాకపోతే ఇక్కడ ఒకటే చిక్కు. మహేష్ సినిమాకు సంబంధించిన షెడ్యూల్స్ ఇంకా ఖరారు కాలేదు. అవి ఓకే అయితే.. డేట్ల విషయంలో ఓ క్లారిటీ వస్తుంది. మరోవైపు రాజమౌళి ప్రీ ప్రొడక్షన్‌ని చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. వర్క్ షాపులు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈనెలాఖరున కొత్త షెడ్యూల్ మొదలయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ సెట్ తీర్చిదిద్దారు. అక్కడే కొత్త షెడ్యూల్ ప్రారంభం అవుతుంది.