మతాలు ఏవైనా సరే మత చాందసం మాత్రం మంచిది కాదు . బాలీవుడ్ అగ్రతార ప్రియాంక చోప్రాకు కొట్టాయం క్యాథలిక్ చర్చి మత చాందసం విచారకరమైన అనుభవం మిగిల్చింది. ఆమె బామ్మ మధు జ్యోత్స్న అఖోరీ ఇటీవల మరణించారు. అఖోరీ క్రైస్తవ మతాన్నిచాలా పద్దతిగా పాటించిన వ్యక్తి. తన భౌతికకాయాన్ని స్వస్థలమైన కొట్టాయంలోని అట్టమంగళం చర్చి సమాధిలో ఖననం చేయాలని ఆమె కోరుకున్నారు. ఆ మేరకు ప్రియాంక ఆమె మృతదేహాన్ని ముంబయి నుంచి కొట్టాయం తీసుకొచ్చారు. కానీ అఖోరీ క్రైస్తవ మతేతరున్ని పెళ్లి చేసుకుందనే కారణంతో ఆ చర్చి అధికారులు అందుకు అనుమతి నిరాకరించారు. చాలా కాలంగా ఆమె ఇక్కడికి రాలేదని కూడా వారు వాదించారు. అయితే అఖోరీ అక్కడే క్రైస్తవం స్వీకరించిందని అప్పుడప్పుడు వచ్చేదని బంధువులు చెప్పారు. అయినా మతాధిపతులు అంగీకరించలేదు. చివరకు పొంకున్నం అనే మరో గ్రామంలోని క్యాథలిక్ స్మశానవాటికలో ఆమెను ఖననం చేశారు. ఇది కూడా కొందరు మతాధిపతుల సహకారంతో సాధ్యమయింది. అంత్యక్రియలకు సంబంధించిన అఖోరీ ఆఖరి హక్కును కూడా నిరాకరించడం అమానవీయమని చాలా మంది వ్యాఖ్యానించారు. ప్రియాంక చోప్రా మాత్రం బామ్మ చివరి కోరిక తీర్చలేకపోయాననే బాధతో వెనుదిరిగారు. జీవితం వెండితెర కన్నా క్లిష్టమైంది కదా!