ఉత్తరప్రదేశ్లో బీజేపీని జీరో చేయడానికి.. ఎస్పీ-బీఎస్పీ పొత్తులు పెట్టుకున్నాయి. కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టారు. జాలి పడి రెండు సీట్లు మాత్రం ఇచ్చారు. కానీ.. రాహుల్ గాంధీ… తన సోదరి ప్రియాంకా గాంధీకి తూర్పు యూపీ బాధ్యతలు ఇవ్వడంతో..సీన్ మారిపోయింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ… పుంజుకుంటుందనే అభిప్రాయం ఒక్క రోజలోనే ఏర్పడిపోయింది. ఫలితంగా.. ఇప్పుడు ఎస్పీ – బీఎస్పీలు తమ కూటమిలో కాంగ్రెస్ను చేర్చుకోవాలనే ఆలోచన ప్రారంభించాయి. కాంగ్రెస్కు ఓ పదిహేను స్థానాలు కేటాయిస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా ప్రారంభమయింది. ప్రస్తుతం ప్రియాంకా గాంధీ అమెరికాలో ఉన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో… యూపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటారు. అప్పుడు ఆమెతో చర్చలు జరపాలని ఎస్పీ, బీఎస్పీ నిర్ణయించుకున్నాయి.
నిజానికి యూపీలో కాంగ్రెస్ పార్టీ అంత తీసి పారేయాల్సిన పరిస్థితిలో ఏమీ లేదు. 2009 పార్లమెంట్ ఎన్నికల్లో 21 లోక్ సభ సీట్లను గెల్చుకుంది, 2014లో బీజేపీ, మిత్రపక్షాలు మొత్తం 80 సీట్లలో 73 గెల్చుకున్నాయి. ఏడు సీట్లు మాత్రమే ఇతరులకు వెళ్లాయి. ఈ ఏడింటిలో రెండు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. బీఎస్పీకి ఒక్కటి కూడా రాలేదు. పైగా.. కనీసం పదికిపైగా నియోజకవర్గాల్లో రెండో స్థానంలో ఉంది. పార్టీ బలంగా ఉన్న 30 నియోజకవర్గాలపై ప్రత్యేకంగా కన్నేసి.. వాటిలో విజయానికి కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు ప్రియాంకా గాంధీ రంగంలోకి రావడంతో.. సీరియస్గా తమ ప్రయత్నాలు తాము చేయాలనుకుంది.
పదిహేను సీట్లు ఇస్తే.. పొత్తునకు కాంగ్రెస్ రెడీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రియాంక రాజకీయాల్లోకి వస్తున్నారని ప్రకటించిన రాహుల్ కూడా ఎస్పీ – బీఎస్పీ పట్ల సానుకూలంగానే మాట్లాడారు. తమకు మాయావతి, అఖిలేశ్ అంటే ప్రేమ, గౌరవ మర్యాదలు ఉన్నాయని ఆయన చెప్పుకున్నారు. బీజేపిని ఓడించేందుకు అందరూ ఐకమత్యంగా ఉంటామని ఆయన అన్నారు. అంటే పొత్తులకు సిద్ధమైనట్లే. ఎన్నికలకు ముందు.. యూపీ కేంద్రంగా మరిన్ని రాజకీయాలు చోటుచేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.