రాజకీయాలపై తనకు ఏ మాత్రం ఆసక్తి లేదని ప్రియాంకా గాందీ ..మొదటి నుంచి చెబుతున్నారు. తన తల్లి, సోదరుల నియోజకవర్గాల బాధ్యతలను మాత్రం ఎన్నికల సమయంలో ఆమె తీసుకుంటారు. కానీ ఈ సారి సోనియా గాంధీ పోటీ చేయడం కష్టమేనని కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఇప్పటికే ప్రచారం చేస్తున్నాయి. అనారోగ్యంతో ఆమె పార్టీ వ్యవహారాలనే పట్టించుకోవడం మానేశారు. అంతా రాహుల్‌పైనే భారం పడింది. అందుకే ఇప్పుడు ప్రియాంకా గాంధీ రాహుల్‌కు తోడుగా రాజకీయాలు ప్రారంభించారు. ఇప్పటి వరకూ ఇదంతా తెర వెనుకే నడుస్తోంది. తనకు బాగా నమ్మకమైన వ్యక్తులను… ఏఐసిసిలో కీలక పదవుల్లో నియమిస్తున్నారు. అలా నియమితులైన ఓ వ్యక్తి విషయం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.
ఇటీవల రాహుల్ గాంధీ…శ్రీనివాసన్ కృష్ణన్ అనే కాంగ్రెస్ నేతను.. జనరల్ సెక్రటరీగా నియమించారు. కేరళకు చెందిన ఈ శ్రీనివాసన్‌కృష్ణన్ ఎవరో పార్టీ నేతలకు ఎవరికీ తెలియదు. కాంగ్రెస్ పార్టీలో ఏఐసిసి కార్యదర్శి స్థాయికి చేరాలంటే.. అంత సులువైన విషయం కాదు. కానీ శ్రీనివాసన్ కృష్ణన్నేరుగా ఏఐసిసి కార్యదర్శి అయ్యారు. ఈయన నియామకం… కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లను సైతం ఆశ్చర్యపరిచింది. కేరళలో ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన వ్యక్తి కాదు శ్రీనివాసన్ కృష్ణన్. ఈయన ఎవరంటే… రాబర్ట్ వాధ్రా, ప్రియాంకా గాంధీల వ్యాపార సంస్థలకు డైరక్టర్. రాబర్ట్‌వాద్రాకు చెందిన అనేక వివాదాస్పద కంపెనీల్లో డైరెక్టర్‌గా పని చేశారు. పలు కంపెనీల్లో ఇప్పటికే డైరక్టర్ హోదాలో ఉన్నారు. కేవలం వ్యాపార సంబంధాల కారణగానే.. శ్రీనివాసన్ కృష్ణన్ … ఏఐసీసీ కార్యదర్శిగా నియమితులయ్యారనే ప్రచారాన్ని ఏఐసిసి వర్గాలు ఖండిస్తున్నాయి.
శ్రీనివాసన్ కృష్ణన్ కు ఏఐసిసి పదవి రావడంలో.. ప్రియాంక పాత్ర కీలకం. ఆమె సిఫార్సుతోనే రాహుల్ అతన్ని కీలక స్థానంలో నియమించారంని అంటున్నారు. అది కూడా.. అధికారం కోసం ముఖాముఖి తలపడుతున్న తెలంగాణ వంటి ముఖ్యరాష్ట్ర బాధ్యతలను ఇచ్చారు. పార్టీలో పట్టు పెంచుకునేందుకు.. ప్రియాంకా గాంధీ… ఇప్పుడు నేరుగా ఏఐసిసి నియామకాల్లో జోక్యం చేసుకుంటున్నారనే విశ్లేషణలు దీనితో ప్రారంభమయ్యాయి. సోనియా గాంధీ క్రమంగా .. కాంగ్రెస్ వ్యవహారాలకు దూరమవుతున్నారు. ఇప్పుడు రాహుల్ కు తోడుగా.. ప్రియాంకా రంగంలోకి వచ్చేందుకు నిర్ణయించుకున్నారన్న ప్రచారం జరుగుతోంది.
అయితే పార్టీలో పనిచేయని వ్యక్తికి.. కేవలం రాబర్ట్ వాధ్రా వ్యాపార భాగస్వామి అన్న కారణంగా.. ఏఐసిసి కార్యదర్శి పదవి ఇవ్వడమే కాకుండా.. కాంగ్రెస్ పార్టీ.. ఓ ప్రధాన పార్టీగా…అధికారం కోసం ముఖాముఖి తలపడుతున్న రాష్ట్రంలో బాధ్యతలు అప్పగించడంపై.. కాంగ్రెస్ సీనియర్లలో అసంతృప్తి ప్రారంభమయింది. కానీ కాంగ్రెస్‌లో అది లెక్కలోకి రాదు.