సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయ తర్వాత గెలుపు అనే పదాన్ని దాదాపు మర్చిపోయిన కాంగ్రెస్, రెండేళ్ల తర్వాత ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తర్ ప్రదేశ్ లో ప్రియాంక గాంధీని తురుపుముక్కగా ఉపయోగించాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. యూపీలో ప్రియాంకనే పార్టీ ప్రచార సారథి అనేది ఖరారైనట్టు తెలుస్తోంది.
యూపీలో దాదాపు మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ అధికారానికి దూరమైంది. కనీసం రెండో స్థానంలో గానీ మూడో స్థానంలో గానీ లేదు. 2012లో నాలుగో స్థానానికి పడిపోయింది. సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి రాగా, బీఎస్పీ రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో నిలిచిన బీజేపీ 47 సీట్లు గెలవగా, కాంగ్రెస్ కు 28 సీట్లు దక్కాయి.
ఈసారి ఎలాగైనా మంచి ఫలితాలు సాధించాలని కాంగ్రెస్ భావిస్తోంది. గతంలో నరేంద్ర మోడీ, నితీష్ కుమార్ లకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ సేవలను ఉపయోగించుకుంటోంది. రాహుల్ లేదా ప్రియాంక గాంధీని సీఎం అభ్యర్థిని చేయాలని ఆయన సూచించారు. దీనికి సోనియా గాంధీ ఒప్పుకోలేదు. కనీసం ప్రియాంకను ప్రచార సారథిగా చేస్తే బాగుంటుందని ప్రశాంత్ కిషోర్ తోపాటు ఆ రాష్ట్రంలోని మెజారిటీ కాంగ్రెస్ నేతలు అభిప్రాయ పడుతున్నారు. నెల రోజుల క్రితం 500 మందికి పైగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ మేరకు ప్రశాంత్ కిషోర్ కు తమ అభిప్రాయం స్పష్టంగా చెప్పారు. రాహుల్ గాంధీ మీద ఆధార పడితే మెరుగైన ఫలితాలు రావని తేల్చి చెప్పారు.
ఇవన్నీ గమనించిన సోనియా గాంధీ, ప్రియాంకను ట్రంప్ కార్డుగా మలచాలని నిర్ణయించినట్టు యూపీ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. యూపీలో 150కి పైగా బహిరంగ సభల్లో ప్రియాకం ప్రసంగించేలా వ్యూహాన్ని ఖరారు చేస్తున్నారు. రాహుల్ కంటే ప్రియాంక ఎక్కువ ప్రచారం చేయడం ఖరారైంది. యూపీ కాంగ్రెస్ కమ్యునికేషన్స్ విభాగం చైర్మన్ సత్యదేవ్ త్రిపాఠి, సినీ నటి, పార్టీ నాయకురాలు నగ్మా కూడా ఇదే విషయాన్ని పరోక్షంగా చెప్పారు. త్వరలోనే తమ పార్టీ వ్యూహం ఖరారవుతుందని, ఆ తర్వాత ముమ్మరంగా ప్రచారం మొదలుపెడతామని తెలిపారు. మొత్తానికి యూపీలో అధికారంలోకి రావడం, లేదా ఎక్కువ సీట్లు గెలవడం ద్వారా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడానికి బాటలు వేసుకోవాలనేది కాంగ్రెస్ వ్యూహం. అన్నట్టు, కాంగ్రెస్ ఉఫాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇంకా ఫారిన్ టూర్ నుంచి తిరిగి రాలేదు. ఈలోగా యూపీ వ్యూహం ఖరారవుతోంది. అదీ కొసమెరుపు!