తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గాడిన పడకపోతూండటం… అందర్నీ కలుపుకుని పోవడంలో రేవంత్ రెడ్డి విఫలం అవుతున్నారన్న భావన ఏర్పడటంతో కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగింది. తెలంగాణ బాధ్యతలను ఇక స్వయంగా చూసుకోవాలని ప్రియాంకా గాంధీ ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. సీనియర్లంతా వరుసగా వెళ్లిపోతున్నారు. వారు పార్టీలో ఉన్న టిక్కెట్ ఇచ్చే పరిస్థితి లేకపోయినా… వారిని పార్టీలో ఉంచడంలో రేవంత్ విఫలమవుతున్నారు.
తాజాగా మర్రిశశిధర్ రెడ్డి కూడా వెళ్లి బీజేపీలో చేరారు. ఆయన ప్రధానంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. దీంతో సీనియర్లు ఎందుకు రేవంత్ ను అంగీకరించలేకపోతున్నారు.. రేవంత్ కలుపుకుని పోవడానికి ఆసక్తి చూపించడం లేదా.. వారే కలవడం లేదా అన్న అంశాలపై పరిశీలన జరుపుతున్నారు. దీంతో పాటు కాంగ్రెస్కు చెందిన ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లను తొలగించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. జగ్గారెడ్డి పదవి ఉంది కనీ బాధ్యతల్ని గతంలోనే తొలగించారు. అజారుద్దీన్ పేరుకే వర్కింగ్ ప్రెసిడెంట్. ఆయన ఎప్పుడూ వర్క్ చేయలేదు. దీంతో వర్కింగ్ ప్రెసిడెంట్లను తీసేసి కొత్తవారిని పెట్టాలనుకుంటున్నారు.
ఇక తెలంగాణ కాంగ్రెస్లో ఏదైనా తనకే రిపోర్టు చేయాలని ప్రియాంకా గాంధీ పార్టీ నేతలకు సూచించినట్లుగా తెలుస్తోంది. గతంలో ఓ సారి ఢిల్లీలో తెలంగాణ నేతలతో భేటీ అయ్యారు. అయితే రేవంత్ రెడ్డి పై ఎక్కువ నమ్మకం ఉంచి.. ప్రతీ విషయంలోనూ జోక్యం చేసుకోలేదు. అయితే రేవంత్ ఎంత ప్రయత్నించినా సీనియర్లు ఆయనను అంగీకరించలేకపోతున్నారు. దీంతో కాంగ్రెస్కు ఇబ్బందులు తప్పడంలేదు. ఇప్పుడుప్రియాంకా గాంధీ లీడ్ తీసుకుంటున్నారు. ఇకనైనా పరిస్థితి మారుతుందేమో చూడాలి.