నరేంద్రమోడీపై వారణశిలో ప్రియాంకా గాంధీని నిలబెడతారంటూ.. జరిగిన ప్రచారానికి.. కాంగ్రెస్ పార్టీ తెరదించింది. అక్కడ అభ్యర్థిగా… అజయ్ రాయ్ అనే నేతను కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. గత ఎన్నికల్లోనూ ఆయనే వారణాశి నుంచి పోటీ చేశారు. మూడో స్థానంలో నిలిచారు. గత ఎన్నికల్లో మోడీపై.. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా.. వారణాశి నుంచి పోటీ చేశారు. రెండో స్థానంలో నిలిచారు. మోడీ మూడు లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ సారి ఎస్పీ- బీఎస్పీ పొత్తులు పెట్టుకోవడంతో సామాజిక సమీకరణాలు వర్కవుట్ అవుతాయన్న ప్రచారం జరిగింది. ప్రియాంక పోటీ చేస్తే పోటీ గట్టిగా ఉంటుందని అనుకున్నారు. కానీ.. నిర్ణయం నేడూ.. రేపూ అంటూ వాయిదా వేసుకుంటూ వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థిగా అజయ్ రాయ్ ని ప్రకటించి.. ఉసూరుమనినిపించింది.
ప్రియాంకా గాంధీ.. ఈ ఎన్నికల సమయంలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె తూర్పు యూపీ బాధ్యతలు తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. తనకు అప్పగించిన బాధ్యతల ప్రకారం విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రియాంకా గాంధీ ఎంట్రీ వల్ల… కాంగ్రెస్కు యూపీలో పూర్వ వైభవం వచ్చినా.. రాకపోయినా… భవిష్యత్ పై మాత్రం.. కార్యకర్తల్లో ఆశ నింపిందని అక్కడి పరిణామాలను బట్టి నిరూపితమయింది. ఈ సమయంలో.. మోడీపై పోటీకి దిగి ఉంటే..ఈ ఎన్నికల్లో అతి పెద్ద పోటీగా మారి ఉండేది. కానీ చివరి క్షణంలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా వెనుకడుగు వేయడం… రాజకీయవర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.
మోడీపై పోటీకి కాంగ్రెస్ ప్రకటించిన అజయ్ రాయ్.. వారణాశిలో కాస్త బలమైన నేతనే. ఎస్పీ- బీఎస్పీ కూటమి తరపున ఎస్పీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. ఎవరు పోటీ చేసినా… మోడీ వర్సెస్ మరో అభ్యర్థి అన్నట్లు సాగితే… పోటీ గట్టిగానే ఉండేది. కానీ ఇప్పుడు.. ముక్కోణపు పోటీ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితి నరేంద్రమోడీకి కలసి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఐదేళ్ల కాలంలో.. వారణాశిలో వచ్చిన మార్పులు.. చేసిన అభివృద్ధి ఏమీ లేకపోయినా.. మోడీ ఇమేజ్ తో సునాయాసంగా గెలిచే అవకాశాలున్నాయని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.