ప్రియాంకా గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావాలనే టాస్క్ పెట్టుకున్నారు. ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉత్తర ప్రదేశ్ బాధ్యతలు చూస్తున్న ప్రియాంకాగాంధీ ఆ బాధ్యతలు నుంచి వైదొలిగారు. ఈ నెలలో టీ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ భేటీ కానున్నారు . 8న రాహుల్ తిరిగి ఇండియాకు చేరుకోనుండగా.. 9న లేదా 10వ తేదీన తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ భేటీ కానున్నారని సమాచారం. నాయకుల మధ్య ఐక్యత, వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారని టీ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకోవాలంటే ఎలాంటి వ్యూహలు అనుసరించాలనే దానిపై చర్చించనున్నారు.
హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ఎన్నికల్లో గెలుపు తర్వాత కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. హిమాచల్, కర్ణాటక రాష్ట్రాల్లో రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు, సభలతో ప్రచారం నిర్వహించారని, కాంగ్రెస్ గెలుపుకు ఇది దోహదపడిందని చెబుతున్నారు. ప్రియాంక పార్టీలో కీలక పాత్రను పోషించాల్సిన అవశ్యకత ఉందని సీనియర్ నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో అయితే ప్రియాంక ప్రభావం ఎక్కువగా ఉంటుందని… పూర్తిగా ఆమెకే బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు.
కొంత కాలంగా తెలంగాణ ఇంంచార్జ్ గా ప్రియాంక గాంధీని నియమిస్తారన్న ప్రచారం ఉంది. అధికారికంగా ఇంకా ప్రకటించకపోయినా తెలంగాణ నేతలుతమకు ఏ సమస్య వచ్చినా ప్రియాంకా గాంధీ వద్దకే వెళ్తున్నారు. ప్రియాంక కూడా యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. ఆమె తెలంగాణకు ఎక్కువ సమయం కేటాయిస్తే.. ఆ ప్రభావాన్ని వీలైనంతగా ఓట్లుగా మల్చుకునేందుకు రేవంత్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది.