ప్రియాంకా గాంధీని క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ఎప్పట్నుంచో ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికైనా పార్టీలో ఆమెకి కీలక స్థానం కల్పించాలన్న డిమాండ్ కాంగ్రెస్ నేతల నుంచే వినిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తన మనసులో మాటలను బయటపెట్టారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రియాంకను నిమించబోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం రేకెత్తాలంటే ప్రియాంకకు బాధ్యతలు అప్పగించడమే సరైందనీ, ఇదే సరైన సమయం అంటూ కాంగ్రెస్ నేతలు ఈ నిర్ణయాన్ని సమర్థించారు. వచ్చే ఎన్నికల్లో భాజపాను ఎదుర్కోవాలంటే యువతరానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందనీ, అందుకే ప్రియాంకకు బాధ్యతలు ఇవ్వాలని అనుకుంటున్నట్టు సోనియా చెప్పారు. అయితే, రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు ఎప్పట్నుంచీ అప్పగించనున్నారు అనే అంశంపై మాత్రం ఆమె స్పందించలేదు.
ప్రియాంక రాకతో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు వస్తుందని నేతలు ధీమాతో ఉన్నారు. ఇతర రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా.. ఈ నిర్ణయంతో తెలంగాణ కాంగ్రెస్ కు బాగా ఊపు వచ్చేట్టుగానే ఉంది! వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రియాంకా గాంధీని మెదక్ ఎంపీగా బరిలోకి దింపాలనే ప్రతిపాదన ఈ సందర్భంగా తెరమీదికి వచ్చిందని సమాచారం. ఈ అంశాన్ని కూడా సోనియా గాంధీ లేవనెత్తారనీ, ప్రియాంకను తెలంగాణ నుంచి పోటీ చేయించడం ద్వారా ఆ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు పెరుగుతాయని సోనియా భావిస్తున్నట్టు చెబుతున్నారు. దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటనా లేకపోయినా.. పలువురు సీనియర్ నేతలతో సోనియా ఆఫ్ ద రికార్డ్ ఈ ప్రతిపాదన గురించి మాట్లాడినట్టు చెబుతున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సరైన దిశ నిర్దేశం లేకపోతోందన్న అసంతృప్తి అధినాయకత్వానికి ఉంది. అందుకే, పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ ను ఈ మధ్యే కూడా కొత్తగా నియమించారు. అయితే, తెలంగాణలో పార్టీని గాడిలో పెట్టాలంటే సరైన నాయకత్వం అవసరముందనీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికి పెద్దరికం ఇచ్చినా ఇతర నాయకులు అసంతృప్తికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న నివేదిక సోనియా దగ్గర ఉందట. అందుకే, ప్రియాంకను మెదక్ నుంచి పోటీకి దించిదే.. ఆమె నాయకత్వంలో రాష్ట్ర కేడర్ అంతా క్రియాశీలంగా పనిచేసే అవకాశం ఉంటుందన్నది ఆమె ఆలోచనగా తెలుస్తోంది. అంతేకాదు, 1980లో మెదక్ లోక్ సభ స్థానం నుంచే ఇందిరాగాంధీ పోటీ చేసి, ఘన విజయం సాధించారు. ఇప్పుడు ప్రియాంకను కూడా అదే సెంటిమెంట్ ప్రకారం రాజకీయాల్లోకి తీసుకొస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే తెలంగాణను ఎంచుకోబోతున్నట్టూ చెబుతున్నారు. ఆ సెంటిమెంట్ సంగతి ఎలా ఉన్నా… ప్రియాంకా గాంధీ మెదక్ నుంచి పోటీకి దిగితే, తెలంగాణలో కాంగ్రెస్ కు కొంత మేలు జరుగుతుందని చెప్పొచ్చు.