రాజీవ్ గాంధీ కుమార్తె . .. రూపు రేఖల్లో ఇందిరాగాంధీలా ఉండే ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. చాలా కాలంగా ఆమె పరోక్ష రాజకీయాల్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారాలు చేస్తున్నా నేరుగా ఎన్నికల బరిలోకి ఎప్పుడూ దిగలేదు. తాజాగా వాయనాడ్ ఉప ఎన్నికల బరిలో దిగాలని ప్రియాంక నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా టిక్కెట్ ప్రకటించింది.
కేరళలోని అద్భుతమైన ప్రకృతి టూరిజానికి కేంద్రమైన వాయనాడ్ లో ముస్లింల ప్రాబల్యం అధికం. అక్కడ గత రెండు సార్లు రాహుల్ గాంధీ గెలిచారు. ఈ సారి ఆయన యూపీ నుంచి కూడా గెలవడంతో వాయనాడ్ వదులుకున్నారు. కానీ ప్రియాంక గాంధీకి రాజకీయ ఆరంగేట్రానికి అది సేఫ్ సీటుగా భావించారు. పిల్లల బాధ్యతలు తగ్గడంతో ఇక పూర్తిగా రాజకీయాల్లోకి రావాలని ప్రియాంక అనుకున్నారు. ఇప్పుడు ఫైనల్ అయింది.
వాయనాడ్ లో ప్రియాంక గాంధీ గెలవడం పెద్ద విషయం కాదు. అయితే ఎంపీ అవడమే ఆమె టార్గెట్ కాదు. దక్షిణాది మొత్తం కాంగ్రెస్ పార్టీని చక్కదిద్దుకునే ప్రయత్నాలను ఆమె చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీకి దక్షిణాది చాలా ముఖ్యం. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగోసారి ఓడిపోకుండా ఉండాలంటే… కర్ణాటక, తెలంగాణలో పార్టీని చక్కదిద్దుకోవాలి. ఏపీలో వచ్చిన అవకాశాల్ని వినియోగించుకోవాలి. వయనాడ్ ఎంపీ హోదాలో ఇక ప్రియాంక ఆ ప్రయత్నాలు చేస్తారని అనుకోవచ్చు.