గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నిర్మించిన ‘టాక్సీవాలా’తో తెలుగు చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయమవుతోన్న అనంతపూర్ అమ్మాయి ప్రియాంకా జవాల్కర్. ‘‘అల్లు అర్జున్ సార్… మీరంటే నాకు చాలా ఇష్టం. మీరంటే క్రష్’’ అని ‘టాక్సీవాలా’ ప్రీరిలీజ్ ఈవెంట్లో మాట్లాడిందీ అమ్మాయి. తనకు పెళ్లైన విషయాన్ని ఇన్‌డైరెక్టుగా గుర్తుచేస్తూ ‘‘క్రష్ అని ఇప్పుడు చెబితే ఏం ప్రయోజనం’’ అన్నాడు అల్లు అర్జున్. ఈ అమ్మాయి పెద్ద హీరోయిన్ అవ్వాలని ఆకాంక్షించాడు. ‘మీ క్రష్ అల్లు అర్జున్‌ని కలవడం ఎలా అనిపించింది?’ అని ఈ రోజు ఇంటర్వ్యూలో ప్రియాంకా జవాల్కర్‌ని అడిగితే ‘‘ముందు అల్లు అర్జున్‌పై నాకు క్రష్ లేదు. తనను కలిశాక క్రష్ ఏర్పడింది. పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయడంలో ముందుంటారు. ఆయన మంచి వ్యక్తిత్వం నాకు నచ్చింది’’ అని చెప్పింది. ‘పోనీ, ఇద్దరూ ఒకే స్టేజి షేర్ చేసుకోవడం ఎలా ఉంది?’ అని అడిగితే… ‘‘చాలా బావుంది. నేను ఆ వీడియోను చాలాసార్లు చూసుకున్నా. షేర్ చేసుకుంది స్టేజి మాత్రమే కదా! అల్లు అర్జున్‌తో సినిమా చేసే ఛాన్స్ ఎప్పుడు వస్తుందో??’’ అని నవ్వేసింది. ‘టాక్సీవాలా’ విడుదల ఆలస్యమైనా విజయం సాధిస్తుందనే నమ్మకం తనకి వుందని చెప్పింది. మధ్యలో ఎన్ని అవకాశాలు వచ్చినా ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూశానని, ఇందులో తన నటన చూశాక పెద్ద అవకాశాలు వస్తాయని నమ్ముతున్నానని ప్రియాంకా జవాల్కర్ అన్నది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదలవుతోన్న సంగతి తెలిసిందే.