కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని పక్కన పెట్టి ప్రియాంకా వాద్రాకి ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించబోతోందని మీడియాలో వస్తున్న వార్తలని ద్రువీకరిస్తున్న రాజకీయ పరిణామం ఒకటి నేడు జరిగింది. ఆమె ఈరోజు సాయంత్రం డిల్లీలో గులాం నబీ ఆజాద్ ఇంటికి వెళ్లి గంటకి పైగా ఈ చర్చించారు. ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్-ఛార్జ్ గా వ్యవహరిస్తునందున వారు ఈ విషయం గురించే చర్చించుకొని ఉండవచ్చని అందరూ భావిస్తున్నారు. ఆమెకి ప్రచార బాధ్యతలు అప్పగిస్తున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్ధి పేరుని త్వరలోనే ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ తెలియజేసింది. అంటే ఆమెనే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించబోతోందా? అనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ఎందుకంటే వచ్చే ఏడాది మొదట్లో జరుగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలవాలంటే ప్రజలకీ, పార్టీ క్యాడర్ కి కూడా ఆమోదయోగ్యమైన నేతని ఎంచుకోవలసి ఉంటుంది. ప్రియాంకా వాద్రాని రాష్ట్ర ప్రజలే కాకుండా పార్టీ నేతలు కూడా ఆమోదిస్తారు. కనుక ఆమె పేరునే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించినా ఆశ్చర్యం లేదు. కానీ డిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఆమెకూడా అందుకు సిద్దమని ప్రకటించారు. ఒకవేళ షీలా దీక్షిత్ ని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించినట్లయితే ప్రియాంకా వాద్రా ప్రచారబాధ్యతలకే పరిమితం కావచ్చు. కానీ ప్రియాంకా వాద్రాకి కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించినట్లయితే, రాహుల్ గాంధీకి నాయకత్వ లక్షణాలపై మళ్ళీ చర్చ మొదలవుతుంది. ఆయనకి ఆ లక్షణాలు లేవు కనుకనే ఆమెకి బాధ్యతలు అప్పగించారని భాజపా, ఇతర పార్టీలు ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. కనుక రాహుల్ గాంధీ ఇమేజ్ దెబ్బ తినకుండా కాంగ్రెస్ పార్టీ తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. బహుశః వారిద్దరికీ ప్రచార బాధ్యతలు అప్పగిస్తారేమో? ఏమైనప్పటికీ ప్రియాంకా వాద్రాకి ప్రచార బాధ్యతలు అప్పగించినట్లయితే, రాహుల్ గాంధీ నాయకత్వ లక్షణాలపై నమ్మకం లేదని కాంగ్రెస్ పార్టీ స్వయంగా ద్రువీకరించినట్లే అవుతుంది.