ఆడది ఒంటరిగా కనిపిస్తే చాలు.. మనిషనేవాడిలో ఉన్న తోడేలు బయటకు వస్తోంది. పీక్కు తినడానికి… ఏ మాత్రం సంకోచించడం లేదు. హైదరాబాద్ శివార్లలో ప్రియాంకరెడ్డి అత్యాచారం, హత్య ఘటన.. ఢిల్లీలోని నిర్బయ ఘటనక కన్నా తీవ్రమైనది పరిగణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలా.. ఈ అత్యాచారం ఘటన కూడా.. ప్రపంచాన్ని కదిలించింది. ప్రపంచ దేశాల మీడియాలన్నీ రిపోర్ట్ చేశాయి. ఈ ఘటనపై దాదాపుగా ప్రతీ దేశం నుంచి.. ఇంటర్నెట్లో సెర్చ్ చేశారు.
అప్పుడు నిర్భయ… ఇప్పుడు ప్రియాంక…!
దేశంలో ప్రముఖులందరూ.. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్యతో సెలబ్రిటీల మనసు విరిగిపోయింది. సోషల్ మీడియా ద్వారా ప్రియాంక రెడ్డి కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తులకు సభ్య సమాజంలో ఉండే హక్కు లేదన్నది అందరి అభిప్రాయం. ప్రియాంక రెడ్డి హత్యపై నటి కీర్తి సురేశ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రియాంక హత్య హృదయ విదాయకరమని.. అత్యాచారం చేసి, దహనం చేయడం బాధించిందన్నారు. రోజురోజుకి పరిస్థితులు భయానకంగా మారుతున్నాయన్నారు. ప్రియాంక రెడ్డి మృతికి నటి అనుష్క సంతాపం తెలిపారు. ఇలాంటి దారుణానికి పాల్పడిన వారిని జంతువులతో పోలిస్తే అవి కూడా సిగ్గుపడతాయని అన్నారు. సమాజంలో మహిళగా పుట్టడం నేరమా అని ప్రశ్నించారు. ఇన్స్టా వేదికగా ఓ భావోద్వేగపు పోస్ట్ పెట్టారు.
నిందితుల్ని ఉరి తీస్తే ఆడపిల్లలకు రక్షణ దొరుకుతుందా..?
ప్రియాంకరెడ్డి హత్య నిందితుల్ని ఉరి తీస్తేనే సమస్యకు పరిష్కారం దొరకదు. ఎందుకంటే.. ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగినప్పుడు… నిర్భయ చట్టం తెచ్చారు. ఆ తర్వాత అలాంటి నేరాల్లో ఏ మాత్రం తగ్గుదల లేదు. ఇంకా పెరిగిపోతున్నాయి. అసలు ఎందుకిలాంటి ఘటనలు జరుగుతున్నాయనేదానిపై… ఎలాంటి సామాజిక, మానసిక పరిస్థితులు.. ఈ నేరాలకు ప్రోత్సహిస్తున్నాయన్న అంశంపై… ఎవరూ సరైన చర్యలు తీసుకోవడం లేదు. పాలకులు ఆలోచించడం లేదు. కేవలం.. ఘటన జరిగిన తర్వాత శిక్షించేదానికి చట్టాలు చేయడానికే తప్ప… జరగకుండా… చూసే ప్రయత్నాలు మాత్రం జరగడం లేదు.
మనిషి రూప తోడేళ్లు ఎలా తయారవుతున్నాయి…? తప్పెవరిది..?
మహిళలు ఒంటరిగా కనిపిస్తే .. వేధించాలన్నంత.. దుర్భుద్ధి మగవాళ్లల్లో ఎందుకు పేరుకుపోతోందనేది.. ఇప్పుడు.. అందరూ పరిశీలించాల్సిన అంశం. పట్టపగలైనా.. ఎవరైనా అమ్మాయి ఒంటరిగా.. హైవేపైనో.. మరో చోట నిలుచుని ఉందంటే… అటు పోయేవారి చూపులన్నీ.. వంకరగానే ఉంటాయి. ఇక చీకట్లో ఉందంటే.. ఇక మనిషిలో.. అప్పటి వరకూ.. సమాజం పై భయంతో ముడుచుకుపోయిన.. తోడేలు.. బయటకు వచ్చేస్తోంది. దీనికి కారణం.. వాళ్లు పెరిగిన పరిస్థితులే. సమాజంలోని పరిస్థితుల్ని మార్చకుండా… మార్పుల్ని ఆశించలేం. మగ పిల్లలకు పెంపకంలోనే ఆడవారి పట్ల గౌరవంగా మెలిగే గుణం అలవడాలనేది మానసిక నిపుణులు చెబుతున్నమాట. ఈ దిశగా ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తే.. ప్రియాంక లాంటి వాళ్లకు రక్షణ దొరకడం ప్రారంభమవుతుంది.