భవానీపూర్‌లోనూ పోటీ చేసి మమతా బెనర్జీని ఓడిస్తానని ఆవేశపడిన సువేందు అధికారిని బీజేపీ హైకమాండ్ చల్లబరిచింది. ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. ఆయనకు బదులు ప్రియాంక టిబర్వాల్ అనే యువ న్యాయవాదికి టిక్కెట్ ఇచ్చారు. మమతా బెనర్జీ వినాయకచవితి రోజునే తన నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తిరుగులేని విజయం సాధించింది. అయితే నందిగ్రాంలో మాత్రం స్వల్ప ఓట్ల తేడాతో మమతా బెనర్జీ ఓటమి పాలయ్యారు. అయితే ఓట్ల లెక్కింపులో గోల్ మాల్ జరిగిందని ఆమె కోర్టుకెళ్లారు. ప్రస్తుతం విచారణలో ఉంది.
కానీ ఎమ్మెల్యేగా లేకుండా ముఖ్యమంత్రి పదవి చేపట్టినందున ఆరు నెలల్లో ఎన్నిక కావాల్సి ఉంది. అందుకే తన పాత నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యేతో వెంటనే రాజీనామా చేయించారు. కానీ ఉపఎన్నికలు నిర్వహిస్తారో లేదోనన్న టెన్షన్ ఏర్పడింది. చివరికి బెంగాల్ ప్రభుత్వం పట్టుబట్టడంతో నిర్వహించక తప్పలేదు. దీంతో మమతా బెనర్జీకి ఓ సమస్య తీరిపోయినట్లయింది. భవానీపూర్‌లో ఆమె గెలుపు నల్లేరుపై నడకేనన్న అంచనాలు ఉన్నాయి. గతంలో రెండు సార్లు అక్కడ గెలవడమే కాకుండా ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో ఆమె పోటీ చేస్తున్నారు.
తాను పోటీ చేసి ఓడిస్తానని సువేందు అధికారి సవాల్ చేస్తున్నారు కానీ.. దాన్ని బీజేపీ హైకమాండ్ కూడా సీరియస్‌గా తీసుకోలేదు. అనుకూల పరిస్థితులు లేని చోట అధికులం అనడం ఎందుకని బీజేపీ హైకమాండ్ కూడా రూటు మార్చినట్లుగా కనిపిస్తోంది. దీదీపై బీజేపీ పోటీకి పెట్టిన ప్రియాంక లాయర్ , ఆమెకు పెద్దగా రాజకీయ అనుభవం లేదు. కానీ బీజేపీ ముఖ్యనేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అభ్యర్థి ఎంపికతోనే బీజేపీ ..మమతా బెనర్జీకి కష్టం లేకుండా చేసిందన్న అభిప్రాయంవినిపిస్తోంది.