అతనో పేరున్న పీఆర్వో. టాలీవుడ్లో ఓ కాంపౌండ్ అండదండలు గట్టిగా ఉన్నాయి. రాజకీయంగానూ కాస్తో కూస్తో పలుకుబడి ఉంది. దాన్ని.. బీభత్సంగా వాడేస్తున్నాడతగాడు. `ఫలానా స్టారు మీ సినిమా ఫంక్షన్ కి హాజరు కావాలా.. అయితే నన్ను సంప్రదించండి`అంటూ చిన్న చిన్న ప్రొడ్యూసర్ల చుట్టూ తిరుగుతూ.. వాళ్లని కవ్విస్తున్నాడు. చిన్న సినిమాకి సంబంధించిన టీజరో, ట్రైలరో స్టార్ చేతుల మీదుగా విడుదలై.. ఆయన నాలుగు మంచి మాటలు చెబితే తమ సినిమాలకే మైలేజీ కదా. అందుకే వాళ్లూ `ఓకే` అనేస్తున్నారు. కానీ… ఇక్కడే ఆ పీఆర్వో బిజినెస్ మైండ్ దాగుంది. సదరు స్టారు ఫంక్షన్ కి రావాలంటే, టీజరో ట్రైలరో విడుదల చేయాలంటే ఖర్చవుతుంది. నిర్మాతలు కొంత సొమ్ము… ఆ పీఆర్వోకి సమర్పించుకోవాలి. అదంతా… సదరు పీఆర్వో జేబుల్లోకే వెళ్లిపోతుంది. అయితే అదేం చిన్న మొత్తం కాదు. లక్షల్లో ఉంటుంది. ఇటీవల ఓ స్టార్ హోటెల్ లో ఓ సినిమా ఫంక్షన్ జరిగింది. ఆ వేడుకకు పేరు మోసిన స్టార్‌ని ఆ పీఆర్వో తీసుకొచ్చాడు. అందుకుగానూ… పీఆర్వో వేసిన బిల్లు అక్షరాలా.. ఏడు లక్షలు. ఫంక్షన్లకు రాకుండా ట్విట్టర్ ద్వారా టీజరో, ట్రైలరో విడుదల చేస్తే మరో రేటు.
తనకున్న పలుకుబడితో స్టార్లతో మాట్లాడడం, వాళ్లని ఫంక్షన్లకు రప్పించడం – ఇదే డ్యూటీగా మారిపోయింది. అయితే నిజం ఎంత కాలం దాగుతుంది? తమ పేరు చెప్పి డబ్బులు గుంజుతున్నాడన్న విషయం… ఆయా స్టార్ హీరోలకు తెలిసిపోయింది. దాంతో.. ఈ పీఆర్వోని కాస్త దూరం పెట్టడం మొదలెట్టేశారు. అయితే ఇప్పటి వరకూ కనీసం ఈ పేరుతో 50 లక్షలైనా సంపాదించేశాడట. ఎవరి వ్యాపారం వాళ్లది మరి!