అందరూ పరీక్షలు రాశారు.. కానీ ఉత్తీర్ణులు కాలేదు. అందుకే అందరికీ ఒకే సారి ప్రొబేషన్ ఇచ్చేందుకే జూన్‌కు వాయిదా వేశాం అని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ గురించి జగన్ చెప్పారు. ఇప్పుడు కూడా అందరికీ ప్రొబేషన్ ఇవ్వడం లేదు. అనధికారిక పరీక్షలు పాసయినవాళ్లకే ఇస్తున్నారు. ఇప్పటికే జిల్లా యంత్రాంగాలకు పై స్థాయి నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆయా జిల్లాల్లో ఎంత మంది గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రొబేషన్‌కు అర్హులు ఉన్నారో చెప్పాలని ఆ ఆదేశాల సందేశం. అదేమిటి.. అందరికీ చేయడం లేదా అంటే.. అందరికీ చేస్తే ఈ ఆదేశాలు ఎందుకు వస్తాయనేది వచ్చే ప్రశ్న.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పరీక్షలు రాసే ఉద్యోగంలోకి వచ్చారు. వారి సర్వీస్ రికార్డులో కానీ..జాయినింగ్ రిపోర్టులో కానీ రెండేళ్ల తర్వాత మరోసారి పరీక్షలు పెడతాం… అందులో పాసయితేనే ప్రొబేషన్ ఇస్తామనే షరతు ఎక్కడా పెట్టలేదు. పరీక్షల్లో ప్రబుత్వ ఉద్యోగం సాధించారనే చెప్పారు. అదే విధంగా లెటర్ ఇచ్చారు. కానీ రెండేళ్లు ముగియక ముందు నుంచే చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పుడు అది పీక్స్‌కు చేరిపోయింది. పరీక్షల మీద పరీక్షలు పెట్టారు. చివరికి కనీసం ముఫ్పై శాతం మందిని వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.
గ్రామ, వార్డు సచివాలయాల్లో తమకు అనుకూలంగా ఉండేవారి.. తమ పార్టీకి వచ్చే ఎన్నికల విధుల్లో ఉపయోగపడతారనుకునేవారకి మాత్రం ప్రొబేషన్ ఇచ్చే ఆలోచన ఏమైనా చేస్తున్నారేమో కానీ.. ఈ వ్యవహారం మొత్తం గుట్టుగా సాగుతోంది. ప్రభుత్వాన్ని నమ్మి మంచి భవిష్యత్‌ను వదులుకుని గ్రామ, వార్డు సచివాలయాల్లో రెండున్నరేళ్లకుపైగా రూ. పదిహేను వేలకే పని చేస్తున్న అనేక మంది అప్పుల పాలయ్యారు. ఇప్పుడు ప్రొబేషన్ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వకపోతే వారి జీవితాలు నాశనం అయిపోయినట్లేనన్న ఆందోళన కనిపిస్తోంది.