వినాయక్ మంచి టెక్నీషియన్. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. రాజమౌళిలా.. హీరోలకు ఎలివేషన్లు ఇవ్వగలడు. బోయపాటిలా ఎమోషన్ పండించగలడు.శ్రీనువైట్లలా ఫన్ తీసుకురాగలడు. కాకపోతే.. ఒక్కటే సమస్య. తన కథల్ని తాను తయారు చేసుకోలేడు. అదే తన బలహీతన. అందుకే చాలా కాలంగా వినాయక్ సినిమాలు చేయడం లేదు. ఇప్పుడు తీస్తున్న ఛత్రపతి కూడా రీమేకే. కథలు తయారు చేసుకోలేకపోవడం వల్లే.. ఇప్పుడు తనకు అవకాశాలు దూరం అవుతున్నాయి.
బాలకృష్ణతో వినాయక్ సినిమా ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంది. సి.కల్యాణ్ దీనికి నిర్మాత. బాలయ్య కోసం ఎన్ని కథలు సెట్ చేయాలని చూసినా కుదరడం లేదు. వినాయక్‌కి మాస్ పల్స్ తెలుసు. బాలయ్యకు ఎలాంటి కథ కావాలో కూడా తెలుసు. కానీ తాను తయారు చేసుకోలేడు. అలాంటి కథలు చేసే రచయితలు ఇప్పుడు దర్శకులుగా మారిపోయారు. దాంతో బాలయ్య దగ్గరకు కథ తీసుకెళ్లలేకపోయాడు. చిరంజీవి విషయంలోనూ ఇదే జరిగింది. వినాయక్ తో చిరంజీవి ఓ సినిమా చేయాల్సివుంది. `కథ తయారు చేసుకో.. సినిమా చేద్దాం` అని చిరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ వినాయక్ మాత్రం చిరుకి తగిన కథ వెదకడంలో విఫలం అయ్యాడు. ఈమధ్య చిరు కథ కోసం తిరిగి తిరిగి వినాయక్ అలసిపోయాడు. ఓ కథ సెట్ చేశాడు కానీ… చివరికి ఆ రచయిత `ఈ కథని నేనే డైరెక్ట్ చేస్తా` అని అడగడంతో ఏం చేయలేకపోయాడట వినాయక్. ఇప్పటి ట్రెండ్ అలానే ఉంది. కథ తయారు చేసుకొనేవాళ్లే.. దర్శకులు. వేరే వాళ్ల కథని డైరెక్ట్ చేస్తానంటే.. హీరోలకు నమ్మకం కుదరడం లేదు. అందుకే వినాయక్ ఈ రేసులో వెనుకబడిపోయాడు.