శివ శంకర్ మాస్టర్ మరణం.. చిత్రసీమని కలచి వేస్తోంది. ఆయనంటే అందరికీ అభిమానమే. మూడు తరాల హీరోలతో పనిచేశారాయన. నలభై ఏళ్ల అనుభవం ఉంది. ఎవరితోనూ గొడవల్లేవు. కాకపోతే.. సిల్క్ స్మితకూ, ఆయనకూ పడేది కాదని… ఇండ్రస్ట్రీలో ఒక టాక్ వినిపించేది. స్కితతో ఆయన ఒక్క సినిమాకీ పనిచేయలేదు. ఓ సినిమాకి స్మిత పాట కోసం శివ శంకర్ మాస్టర్ని తీసుకుంటే – `ఆయనతో నేను ఈ పాట చేయను` అని సెట్లోంచి వెళ్లిపోయిందట స్మిత. మరి ఇద్దరి మధ్యా ఏం జరిగి ఉంటుంది? ఎవరితోనూ వివాదాలు పెట్టుకోని శివ శంకర్ మాస్టర్‌కి స్మితతో వచ్చిన చిక్కేంటి?
ఈ విషయాన్ని ఓ సందర్భంలో శివ శంకర్ మాస్టరే స్వయంగా చెప్పుకొచ్చారు. బాలకృష్ణ సినిమా `భలే తమ్ముడు`కి శివ శంకర్ డాన్స్ మాస్టర్. అందులో ఓ ప్రత్యేక గీతం ఉంది. ఆ పాటలో స్మిత చేయాలి. డాన్స్ రిహార్సల్స్ కూడా అయిపోయాక… `శివ శంకర్ తో నేను ఈ పాట చేయను` అని స్మిత అలిగి వెళ్లిపోయింది. స్మితకు ఎంత నచ్చజెప్పినా ఆమె ఒప్పుకోలేదు. డాన్స్ మాస్టర్ ని మారిస్తే తప్ప ఈ పాట చేయను అందట. అప్పటికే శివ శంకర్ నాలుగు పాటలు కంపోజ్ చేశారు. ఐటెమ్ గీతాలు బాగా తీస్తారని ఆయనకు పేరుంది. అందుకే.. స్మితని పక్కన పెట్టి, జయమాలినితో ఆ పాట పూర్తి చేశారు. అప్పుడు స్మితకు మరింత కోపం వచ్చింది. `ఈ జన్మలో శివ శంకర్ మాస్టర్‌తో పనిచేయను` అందట. ఆమె చెప్పినట్టే… ఆ తరవాతెప్పుడూ శివ శంకర్ తో ఆమె పనిచేయలేదు.
అప్పట్లో స్మిత చాలా బిజీ స్టార్. ఆమె డేట్ల కోసం నిర్మాతలు క్యూకట్టేవారు. స్మిత పాట హిట్టయితే, సినిమా హిట్టన్న నమ్మకం ఉండేది. దాన్ని కొన్నాళ్ల పాటు స్మిత కూడా అడ్వాంటేజ్ తీసుకుంది. డాన్స్ మాస్టర్లని కూడా స్మితే రికమెండ్ చేసేది. తను చెప్పినవాళ్లనే డాన్స్ మాస్టర్లుగా తీసుకోవాలి. లేదంటే.. స్మిత ఆ పాట చేయదు. అదీ రూలు. అందుకే శివ శంకర్ లాంటి వాళ్లతో స్మిత పనిచేయనిన మొండికేసేది. అయితే స్మిత అంటే శివ శంకర్ మాస్టారుకి చాలా అభిమానం. ”తను చాలా గొప్ప డాన్సర్. డ్రస్సింగ్ స్టైల్ కూడా బాగుండేది. సొంత డబ్బుతో కాస్ట్యూమ్స్ కొనుక్కుని వచ్చేది. అంత డెడికేషన్ నేను ఎవరిలోనూ చూడలేదు. సలీమ్ మాస్టారుతో ఆమె చాలా పాటలకు డాన్స్ చేసింది. అప్పట్లో నేను అసిస్టెంట్ గా ఉండేవాడ్ని. ఆ తరవాత.. డాన్స్ మాస్టర్ అయ్యా. ఓ అసిస్టెంట్ డాన్స్ మాస్టర్ గా మారి, ఆమెకు డాన్స్ పాఠాలు చెప్పడం నచ్చలేదేమో. అందుకే నాతో ఆమెకు పడలేదు” అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు శివ శంకర్ మాస్టార్.