టీజర్ తో ఊపు మీదకు వచ్చిన ‘జనతా గ్యారేజ్’ కు ఇప్పుడు కొత్త ఇబ్బంది మొదలైనట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ హీరోగా, మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ఇప్పుడు ఆ మలయాళీ స్టార్ హీరోతో ఇబ్బంది కలుగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏమిటా సమస్య అంటే.. డబ్బింగ్ విషయంలో! మోహన్ లాల్ కు సొంత డబ్బింగ్ చెప్పించాలా.. లేక వేరే ఎవరితోనైనా ఆయనకు డబ్బింగ్ చెప్పించాలా? అనేది దర్శకుడు కొరటాల శివకు సమస్య గా తయారైందని సమాచారం.
మోహన్ లాల్ అయితే తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకోవడం పట్ల ఉత్సాహంగా ఉన్నాడు. ఈ మధ్యనే ఆయన నటించిన ‘మనమంతా’ కు ఆయనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు కూడా. ఇప్పటికే ఆ సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. కానీ.. అందులో లాల్ డబ్బింగ్ లో ఒరిజినాలిటీ లేకుండా పోయింది. ఎవరో తెలుగు రాని వ్యక్తి తెలుగు మాట్లాడాడని ఆ టీజర్ తో స్పష్టం అవుతోంది! సినిమా ఆసాంతం ఆ పాత్ర అలాంటి వాయిస్ తోనే కొనసాగితే ఎలా? అనేది ఆ టీజర్ చూసిన వారిని ఇబ్బందిపెడుతున్న అంశం.
ఇలాంటి నేపథ్యంలో జనతా గ్యారేజీ డబ్బింగ్ పనులు ఇంకా మొదలుకాలేదు. ‘మనమంతా’ టీజర్ చూసిన తర్వాత కొరటాల ఇదే విషయంపై ఆలోచిస్తున్నాడని.. ప్రస్తుతానికి అయితే లాల్ చేత డబ్బింగ్ చెప్పించాలని కొరటాల అనుకోవడం లేదని.. లాల్ చేసింది పవర్ ఫుల్ పాత్ర కాబట్టి ఉచ్ఛరణలో ఎలాంటి దోషాలూ లేకుండా ఉండాలి. దోషాలు గనుక ఉంటే.. ఆ పాత్ర ఔచిత్యం దెబ్బతింటుంది. అయితే ఆ మలయాళీ స్టార్ మాత్రం తెలుగు నేర్చుకోవడం ఎప్పుడో మొదలుపెట్టేశాడు. ఇలాంటినేపథ్యంలో ఆయనకు సున్నితంగా చెప్పి.. వేరే వాళ్ల చేత డబ్బింగ్ చెప్పించడం కొరటాల కు కత్తిమీద సామే!