రాజకీయాల్లో విలువలకు బదులు జిత్తులు, ఎత్తులే ముఖ్యం కావడం భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో షరామామూలే. ఒక కేసు దాఖలైన సమయంలో ఎక్కడో గుజరాత్ లో ఉన్న వ్యక్తి, ఇప్పుడు ఆ కేసును కుట్రపూరితంగా దాఖలు చేయించిన సూత్రధారి అని ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావడం విచిత్రం.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఇప్పుడొక విషమ పరీక్ష ఎదురైంది. నేషనల్ హెరాల్డ్ కేసులో తాము కోర్టు బోనెక్కాల్సి రావడం సోనియా, రాహుల్ గాంధీలకు కోపం తెప్పించింది. అందుకే, పాటియాలా హౌస్ కోర్టు బెయిలు మంజూరు చేయగానే ఆగమేఘాల మీద ఎ ఐ సి సి ఆఫీసుకు వెళ్లి మీడియాను పిలిచి, మోడీపై దుమ్మెత్తిపోశారు. తల్లీ కొడుకులు మోడీపై చేసిన ఆరోపణలు, వారి అసహనాన్ని స్పష్టంగా ప్రతిబింబించాయి. కేసును కోర్టులో తేల్చుకోవడానికి బదులు, ప్రధాన మంత్రిని తిట్టడానికి దీనిని ఒక సాధనంగా ఎంచుకోవాలనేది కాంగ్రెస్ వ్యూహం.
నెహ్రూ స్థాపించిన నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తులను సోనియా, రాహుల్ గాంధీ అక్రమంగా స్వాధీనం చేసుకున్నారంటూ 2012లో సుబ్రమణ్య స్వామి ఒక పౌరుడిగా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పటికి ఆయన బీజేపీ నాయకుడు కాదు. 2013లో ఆయన బీజేపీలో చేరారు. ఇక. 2012లో నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. గత ఏడాది మేనెలలో ఆయన ప్రధాన మంత్రి అయ్యారు. అంటే, సుబ్రమణ్య స్వామిచేత కుట్రపన్ని మోడీయే కేసు వేయించారనేది అబద్ధమని కమలనాథులు చెప్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆలౌట్ గేమ్ ప్లాన్ తో మోడీని టార్గెట్ చేస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో కేవలం 44 సీట్లు దక్కాయి. కాంగ్రెస్ చరిత్రలో ఇంత తక్కువ సీట్లు ఎప్పుడూ రాలేదు. ఇంతకంటే తక్కువ సీట్లు పొందడం బహుశా సాధ్యం కూడా కాదు. ఆ తర్వాత రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వరసబెట్టి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. మొన్న బీహార్లో మాత్రం మహాకూటమి పుణ్యమా అని కాస్త గౌరవపూర్వకంగా సీట్లు దక్కాయి. సంకీర్ణ ప్రభుత్వంలో చోటు దక్కింది.
మరో వైపు, పార్టీకి కొత్త ఉత్తేజం ఇవ్వడం సాధ్యం కావడం లేదు. కేడర్ లో జోష్ నింపడంలో రాహుల్ గాంధీ ఇంతవరకూ సఫలం కాలేదు. ఆయనే తరచూ విచిత్రమైన వ్యాఖ్యలు చేసి విమర్శల పాలవుతున్నారు. ఈ దశలో పార్టీని గాడినపెట్టే నాయకత్వం లేకుండా పోయిన సూచనలు కనిపిస్తున్నాయి. ఏ రకంగా చూసినా పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఇప్పుడు ఇక నష్టపోవడానికి ఏమీ లేదు. ఏం చేసినా కోల్పోవడానికంటూ పెద్దగా ఏమీలేదు. మెజారిటీ రాష్ట్రాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలే ఉన్నాయి. కాబట్టి, మోడీని టార్గెట్ చేయడం, రాజకీయ కక్ష సాధింపు అనేది జనం నమ్మేలా చేయడం ద్వారా సానుభూతి పొందాలని సోనియా, రాహుల్ భావిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.
ఎవరేమనుకుంటే మాకేంటి అనే తరహాలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది. కనీస మొహమాటాలను కూడా వదిలేసింది. సాధారణంగా ఎవరైనా ఆందోళన చేసినా, నిరసన తెలిపినా అది ఎందుకో చెప్తారు. తమ డిమాండ్ ఏమిటో తెలుపుతారు. చిన్న పిల్లలు కూడా మారాం చేసేటప్పుడు నాకిది కావాలి అని చెప్తారు. కాంగ్రెస్ మాత్రం నేషనల్ హెరాల్డ్ కేసు నేపథ్యంలో కనీసం డిమాండ్ ఏమిటో చెప్పకుండా పార్లమెంటులో నినాదాలతో హోరెత్తించింది. రాజ్యసభలో అయితే వారు ఆడింది ఆటగా మారింది. వెల్ లో తిష్టవేసి నినాదాలు చేయడం, రకరకాల జంతువుల్లా అరవడం షరామామూలై పోయింది. మీరెందుకు అరుస్తున్నారు, మీ డిమాండ్లు ఏమటని డిప్యుటీ చైర్మన్ పదే పదే అడిగినా జవాబు లేదు. కాంగ్రెస్ వారు సభ వాయిదా పదే వరకూ అరుపు కేకలు మానలేదు.
తమ చేష్టల వల్ల ప్రజల్లో పలుచన అవుతామేమో అనే భయం కాంగ్రెస్ వారికి లేదు. తమ చేతలు ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉన్నాయని మేధావులు, విద్యావంతులు విమర్శిస్తారేమో అనే వెరపు సైతం ఉన్నట్టు కనిపించలేదు. పోగొట్టుకోవడానికి ఏమీ లేనప్పుడు విమర్శలు వస్తే ఏంటనే తరహాలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.
దీన్నిబట్టి, మోడీని ఎడాపెడా తిట్టడమే కాంగ్రెస్ వారి తాజా ఎజెండా అని స్పష్టమవుతోంది. దీన్ని ఆయన ఎలా ఎదుర్కొంటారో చూడాలి. మొండివాడు రాజుకన్నా బలవంతుడు అంటారు. తెగించిన వాడిని ఎదుర్కోవడం మామూలు విషయం కాదు. కాంగ్రెస్ కు కోల్పోవడానికి ఏమీ లేకపోవచ్చు. బీజేపీకి మాత్రం నష్టపోకుండా చూసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కేంద్రంలో అధికారం ఉంది. అనేక కీలక రాష్ట్రాల్లో ప్రభుత్వాలున్నాయి. అన్నింటికీ మించి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత మోడీ ప్రభుత్వంపై ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ వారి దూకుడుకు మోడీ ఎలా చెక్ పెడతారనేది ఆసక్తికరమైన విషయం.