ఓటుకు నోటు కేసులో . ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కూడా విచారించవచ్చని ఎసిబి కోర్టుకు నివేదించినట్టు వార్తలు వచ్చాయి. దీనికి తోడు ఎసిబి చీప్ ఎకెఖాన్ గవర్నర్‌ను కలవడం కూడా ఆసక్తి పెంచింది. గవర్నర్ ఎందుకు పిలిచారు వేగవంతం చేయడానికా లేక సర్దుబాటు చేయడానికా అనేదానిపై భిన్నమైన అంచనాలు వున్నాయి. టిఆర్ఎస్ ప్రభుత్వ వర్గాలు ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటున్నాయి. కోర్టు ఆదేశించాక ఏదో ఒకటి చేయాలి కదా.. అని ఒక ముఖ్యమంత్రి కార్యాలయానికి దగ్గరగా వుండే ఒక ప్రజా ప్రతినిధి వ్యాఖ్యానించారు. అంతా కోర్టు ఎసిబి చూసుకుంటాయి.ఎలా బయిటపడాలనే లీగల్ వ్యూహం చంద్రబాబుకు కావలసినంత వుంటుంది అని ఆయన అన్నారు. తమకైతే ఈ కేసు మీద ఇంకా ఆసక్తి లేదనీ, ఏదో చేయాలనే కోపం అంతకన్నా లేదనీ స్పష్టం చేశారు.తాము హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లాము గనకో లాలూచీ పడ్డామన్న ఆరోపణ అర్థం లేనిదని టిఆర్ఎస్ నాయకులంటున్నారు.
ఇక పోతే చంద్రబాబును విచారించడం జరిగినా అది కెసిఆర్‌ను సిబిఐ లాంఛనంగా విచారించినట్టు గుంభనగా జరిగొచ్చు. పైగా ఆయన ఫోన్ సంభాషణలో చాలా జాగ్రత్తగా పదాలు వాడినందువల్ల సంబంధం వున్నట్టు నిరూపించడం కూడా కష్టమేనని కొందరు చెబుతున్నారు. సెప్టెంబరు 29 నాటికి ఎసిబి కోర్టుకు ఇచ్చే నివేదికలో ఇప్పటి వరకూ జరిగిన ప్రక్రియ పేర్కొని మరింత గడువు కోరుతుందని కూడా అధికార వర్గాలంటున్నాయి. ఇందుకు తగినట్టే చంద్రబాబు నాయుడు కూడా మీడియా వద్ద ఆచితూచి స్పందించారు. అదే సమయంలో ఒకోసారి అనుకోని మలుపులు వస్తుంటాయి గనక అలసత్వం పనికిరాదనే భావన టిడిపిలో వుంది.ఇలాటి పరిస్థితి తెచ్చిపెట్టిన వారిపై మిగిలినవారిలో చాలా ఆగ్రహం కూడా వుంది. అయితే తమ నాయకుడి దగ్గర చాలా వ్యూహాలు వుంటాయని వారు గట్టిగా చెబుతున్నారు. ఆయనకు న్యాయవ్యవస్థపై వున్న పట్టు కూడా రహస్యమేం కాదు కదా అని అటు వైసీపీ ఇటు టిడిపి మరో పక్క టిఆర్ఎస్ కూడా ఒకే మాట చెప్పడం మరో విశేషం.