లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ప్రదర్శించినందుకు రెండు ధియేటర్లు మూత పడబోతున్నాయి. ఇలా మూత పడేది.. కలెక్షన్లు లేక కాదు.. రామ్ గోపాల్ వర్మ తరహా రెటమతం చూపించినందుకు. అన్నీ తెలిసి… లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ప్రదర్శించిన రెండు ధియేటర్ల లైసెన్సులు రద్దు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. సినిమాపై నిషేధం ఉన్నా.. అడ్డుకోలేకపోవడంతో.. కడప జాయింట్ కలెక్టర్ పై.. ఈసీ చర్యలు తీసుకోవడానికి సిద్ధమయింది. బయోపిక్‌లపై.. ఎన్నికల సంఘం నిషేధం విధించింది. కౌంటింగ్ ముగిసే వరకూ.. రాజకీయ నేతల బయోపిక్ లు విడుదల చేయకూడదని స్పష్టమైన ఆదేశాలిచ్చింది.
అయితే… రామ్‌గోపాల్ వర్మ మాత్రం.. తాను తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను విడుదల చేస్తానని పట్టు బట్టారు. ఈసీకి ఆయన లేఖ రాసి.. విడుదల చేస్తున్నట్లు ప్రకటించేసుకున్నారు. అయితే.. ఈసీ రూల్స్ రూల్సేనని చెప్పడంతో.. విడుదలకు ఆటంకం ఏర్పడింది. అయితే.. ఏం జరుగుతుందో.. చూద్దాం అనుకున్నారో కానీ … ధియేటర్లకు క్యూబ్ లు పంపించేశారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ధియేటర్ల యజమానాలు మాత్రం.. ప్రదర్శించడానికి వెనుకడుగు వేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ షో వేయాలన్న పట్టదలతో..కడప,పోరుమామిళ్లలోని…వైసీపీ నేతలకు చెందిన రెండు ధియేటర్లలో మాత్రం షో వేశారు.
దీనిపై…ఫిర్యాదులు వెళ్లడంతో.. ఈసీ సీరియస్ అయింది. చట్టాన్ని ఉల్లంఘించి సినిమాలు ప్రదర్శించినందుకు… ధియేటర్ల లైసెన్స్ ను క్యాన్సిల్ చేయాలని ఆదేశించారు. పట్టించుకోవాల్సిన జాయింట్ కలెక్టర్ లైట్ తీసుకోవడంతో.. ఆయనపైనా చర్యలు తీసుకోబోతున్నారు. మరికొన్ని చోట్ల కూడా.. లక్ష్మీస్ ఎన్టీఆర్ షో పడిందనే ప్రచారం జరుగుతోంది. వీటిపైనా ఈసీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.