ఉత్తర్ ప్రదేశ్ లో అధికార సమాజ్ వాదీ పార్టీలో లుకలుకలు మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ అంతా బాగానే ఉందని గురువారం మధ్యాహ్నం ప్రకటించారు. తన తమ్ముడు శివపాల్ యాదవ్ యూపీ శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతారని తేల్చి చెప్పారు. ములాయం కుమారుడు, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు మింగుడు పడని విషయమిది.
ములాయం కుటుంబంలో 19 మంది రాజకీయాల్లో ఉన్నారు. అధికార పదవులు అనుభవిస్తున్నారు. యూపీలో ములాయం కుటుంబమే చక్రం తిప్పుతోంది. అయితే, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలవాలంటే పార్టీ ఇమేజిని కాపాడుకోవాలనేది అఖిలేష్ ఉద్దేశం. అతడి బాబాయ్ శివపాల్ యాదవ్ మాత్రం మాపియా డాన్ పార్టీని ఎస్పీలో విలీనం చేయాలని పట్టుబడుతున్నారు. దీన్ని అఖిలేష్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మైనారిటీ ఓట్ల కోసం మాఫియా డాన్ తో చేతులు కలిపితే ప్రజల్లోపార్టీ ఇమేజి డ్యామీజీ అవుతుందంటున్నారు.
శివపాల్ యాదవ్ మాత్రం ఇదేమీ పట్టించుకోవడం లేదు. ములాయం కూడా తమ్ముడి మాటను కాదనలేని పరిస్థితి. ఎన్నికల్లో పార్టీకి కావాల్సిన బలాన్ని బలగాన్ని సమకూర్చేది శివపాల్ యాదవే. పెద్ద సంఖ్యలో ఉన్న అతడి అనుచరులు ఎన్నికల సమయంలో పార్టీకి పలు విధాలుగా ఉపయోగపడతారు. కాబట్టి అతడిని దూరం చేసుకుంటే పార్టీ ముక్కలు కావచ్చని భావిస్తున్నారు.
సమాజ్ వాదీ పార్టీలో తాజా పరిణామాలు బీజేపీకి సంతోషం కలిగిస్తున్నాయి. అధికార బలం గల ఎస్పీని ఎదుర్కోవడానికి కమలనాథులు రకరకాల వ్యూహాలు రచిస్తున్నారు. ప్రధాని మోడీ సూచనల మేరకు అమిత్ షా పక్కా ప్లాన్ వేసే పనిలో బిజీగా ఉన్నారు. అనుకోకుండా ఆ పార్టీలో పెను వివాదం చెలరేగడం తమకు లాభిస్తుందని బీజేపీ నేతలుఅంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, ప్రజలకు భద్రత లేదని ఇప్పటికే ఎస్పీ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలుగుప్పిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అంచనా వేస్తోంది.
యూపీలో వారం రోజుల క్రితం వెలువడిన తొలి సర్వే అంచనాలు హంగ్ అసెంబ్లీ ఏర్పడవచ్చని తేల్చాయి. అంటే, ప్రభుత్వ వ్యతిరేక ఎక్కువే. కాబట్టి దీన్ని వీలైనంత క్యాష్ చేసుకుంటే పరిస్థితి తమకు అనుకూలంగా మారుతుందని కమలనాథులు ఆశాభావంతో ఉన్నారు. ఎస్పీలోతాజా పరిణామాల వల్ల పార్టీ మొత్తం ఏకతాటిపై నిలిచి ఎన్నికల్లో పోరాడలేక పోవచ్చని బీజేపీ అంచనా. కాబట్టి ఇది కూడా తమకు లాభం కలిగిస్తుందనే బీజేపీ ధీమా నిజమవుతుందో లేదో చూద్దాం.