బాలయ్య కాస్త తమాషా మనిషి. ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవ్వరూ చెప్పలేరు. ఎప్పుడు చిన్నపిల్లాడిలా నవ్వుతాడో, ఎప్పుడు ఉగ్రరూపం దాలుస్తాడో కనిపెట్టలేరు. అత్యంత సన్నిహితులు కూడా బాలయ్య మూడ్‌ని అంచనా వేయలేరు. అందుకే ఫ్యాన్స్ కూడా బాలయ్య `తీపి` చంపదెబ్బలకు అలవాటు పడిపోయారు. అయితే.. ఈమధ్య బాలయ్య మరీ మూడీగా ఉంటున్నాడని, తన సన్నిహితుల్ని కూడా దగ్గరకు రానివ్వడం లేదని ఇండ్రస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఇటీవలే బాలయ్య పుట్టిన రోజు జరిగింది. సాధారణంగా పుట్టిన రోజున సన్నిహితులు, స్నేహితులు, పరిశ్రమ వర్గాలూ బాలయ్యని కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు. కానీ బాలయ్య కొంతమందిని కావాలని దూరం పెట్టాడని, ఇంట్లోనే ఉండి `లేడు` అని చెప్పించాడని సమాచారం. బాలయ్యతో సినిమా చేద్దామని ప్రయత్నించిన ఓ దర్శకుడ్ని కూడా బాలయ్య దగ్గరకి రానివ్వలేదట. ఈ విషయాన్ని సదరు దర్శకుడే తన సన్నిహితులకు చెప్పుకుని బాధపడుతున్నాడు.
ఇలా బాలయ్యని కలవలేకపోయిన వాళ్లలో ఇంకొంతమంది దర్శకులు, నిర్మాతలూ కూడా ఉన్నారని తెలుస్తోంది. అభిమాన సంఘాల నాయకుల విషయంలోనూ ఇదే జరిగిందని సమాచారం అందుతోంది. తన చుట్టూ ఉన్న ఆ కొద్ది మందితోనూ బాలయ్య ఇది వరకటిలా మాట్లాడడం లేదని, తరచూ కోపగించుకుంటున్నాడని, ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల వల్ల బాలయ్యకు అత్యంత సన్నిహితులు కూడా దూరమయ్యారని ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. రెండోసారి ఎం.ఎల్.ఏగా గెలిచినా – తన పార్టీ అధికారంలోకి రాలేదన్న అసంతృప్తి బాలయ్యలో చాలా ఉంది. ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే బాలయ్యకు మంత్రి పదవి దక్కొచ్చని నందమూరి అభిమానులు ఆశపడ్డారు. అవేం జరగలేదు. దాంతో బాలయ్య అసహనానికి గురవుతున్నాడేమో అనిపిస్తోంది. అయితే ఈ కోపం వల్ల ఇప్పటికే కొంతమంది అభిమానుల్ని కోల్పోయాడు బాలయ్య. ఇదే కొనసాగితే – మరింత మంది దూరమయ్యే ప్రమాదం ఉంది. బాలయ్యలోని అన్ని కోణాలూ అభిమానులకు నచ్చుతాయి. బాలయ్య కొట్టినా ఇష్టమే. కానీ.. ఇలా దూరం పెట్టడం మాత్రం కొంతమంది సహించలేకపోతున్నారు. బాలయ్యలో ఈ అసంతృప్తి సెగలు ఎప్పటికి చల్లబడతాయో..??