భూ సేకరణకు సంబంధించిన 123,124 జీవోలను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు కెసిఆర్ ప్రభుత్వానికి రాజకీయంగా చాలా ప్రతికూల సమయంలో వచ్చిందని చెప్పాలి. 2013 భూసేకరణ చట్టాన్ని వమ్ము చేసేందుకే ఈ జీవోలు తీసుకొచ్చారని ప్రతిపక్షాలు చెబుతూనే వున్నాయి. ఉద్యమాలు ఆందోళనలు కూడా నడుస్తున్నాయి. 2013 చట్టం ప్రకారం – గ్రామసభలో 80 శాతం మంది ప్రజల ఆమోదం, సామాజిక ప్రభావ అంచనా, మార్కెట్ రేటుకు నాలుగు రెట్లు పరిహారం, ఎస్సిఎస్టిలైతే సమానమైన భూమి, దానిపై ఆధారపడిన వారికి కూడా పునరావాసం వంటి అనేక సహాయ ఉపశమన చర్యలు వున్నాయి. ఆ బాధ్యతలనుంచి ఆర్థిక భారాల నుంచి తప్పించుకోవడానికే ప్రభుత్వం ఏకపక్షంగా 123 జీవో తెచ్చింది. వ్యక్తులనుంచి భూమి కొనుక్కోవడం, తదుపరి బాధ్యతలు లేకుండా చేతులు దులిపేసుకోవడం దీని సారాంశం.ఒకసారి ధర చెల్లించిన తర్వాత ఇంకా పునరావాస బాధ్యత ఏమిటన్నది వారి వాదన. మానవత్వమే గాక శాసనబద్దత కూడా లేని ఈ వాదన అన్ని వైపుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్నది. అయినా ప్రభుత్వం కళ్లు తెరవలేదు.2013,123 ఏదైనా సరే నంటూ లేనిపోని ఆఫర్ ఇచ్చి ఆచరణలో మాత్రం 123 ప్రకారమే ముందుకు నడిచింది.
మల్లన్నసాగర్ రిజర్వాయర్ సమస్యలో ఇది తీవ్రరూపం తీసుకున్నది గాని మహబూబ్నగర్ జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలోనూ అభ్యంతరాలు వ్యక్తమైనాయి. నిమ్స్, ఫార్మాసిటీ,ఇతర ప్రాజెక్టులు రకరకాల రూపాల్లో 9 లక్షల ఎకరాల వరకూ భూములు గుంజుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఆ ప్రాజెక్టుల తీరుతెన్నులపైన గాని భూ సేకరణ వత్తిళ్లపై గాని ఎన్ని ఆందోళనలు ఆవేదినలు వ్యక్తమైనా పట్టించుకోలేదు. పైగా లాఠీచార్జీల వరకూ వెళ్లింది. ఇలాటి తరుణంలలో జహీరాబాద్ నిర్వాసితుల పిటిషన్పై హైకోర్టుఇచ్చిన తీర్పు సంచలనాత్మకమైంది. గతంలో కూడా 16 సార్లు కేసిఆర్ ప్రభుత్వం కోర్టులో భంగపడింది.ఇటీవలనే విసిల నియామకాన్ని కూడా హైకోర్టు కోట్టివేసింది. అయితే తర్వాత కూడా వారినే కొనసాగించడం ద్వారా ప్రభుత్వం మొండి తనానికి పోయింది.ఇప్పుడు కూడా తన జీవోలను సమర్థించుకుంటూ విస్త్రత ధర్మాసనానికి వెళ్తానంటున్నది. అప్పుడురాజకీయ నష్టం మరింత విస్త్రతం కావచ్చునేమో! దానికన్నా ప్రజాభిప్రాయాన్ని ఆలకించి ప్రజాస్వామ్య విలువలు కాపాడుకుంటే బావుండేది. పీజు రీ ఇంబర్స్మెంట్,రిజిస్ట్రేషన్లు, విసిల నియామకం, ఇలా అనేక ముఖ్యమైన విషయాల్లో టి సర్కారు దెబ్బతింటున్నది.ఓటుకు నోటు వ్యవహారం కూడా వెనక్కు పోయింది. అందుకే మేము హైకోర్టు విభజన కోరుతున్నామని వారంటారు గాని వాస్తవానికి ప్రభుత్వ ఆలోచనా ధోరణిలోనే పొరబాటు వుందని గుర్తించడం లేదు.