జగన్ రెడ్డి పులివెందులకు పండుకో.. పబ్బానికో వస్తారు. ఆయన వచ్చినప్పుడు తమకు రావాల్సిన బిల్లుల గురించి చెప్పుకోవాలని.. ఎలాగోలా సాయం చేయాలని అడిగేందుకు రాయలసీమలోని అన్ని జిల్లాల నుంచి పార్టీ క్యాడర్ వస్తున్నారు. వారు తమ ఆర్థిక పరిస్థితి వివరించి గొల్లుమంటున్నారు. బిల్లులు రాకపోతే తమ కుటుంబాల పరిస్థితి గందరోగళంగా అవుతుందంటున్నారు.అయితే వారి మాటలు కూడా ఆలకించని జగన్ రెడ్డి ఇప్పుడు కూడా బిల్లులంటే ఎలా అని చిరాకుపడి పంపేస్తున్నారు. ఈ వ్యవహారంపై వైసీపీ కార్యకర్తల్లో నిర్వేదం వ్యక్తమవుతోంది.
జగన్ ప్రజాదర్బార్ పెడతారు రావాలని కార్యకర్తలకు సమాచారం ఇస్తున్నారు. వారు వస్తే కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వడం లేదని మథనపడుతున్నారు. జగన్ ప్యాలెస్ కు ఎప్పుడో పదకొండు గంటలకు వచ్చి.. రెండు మూడు గంటలు కార్యకర్తల దగ్గర విజ్ఞప్తులు తీసుకుంటున్నారు. ఈ కొద్ది సమయానికే అన్ని జిల్లాలకు సమాచారం పంపుతున్నారు. వచ్చిన వారికి చాలా ఆలస్యం అవుతుంది. అయినా కనీస ఏర్పాట్లు కూడా చేయడం లేదు. ఇది కార్యకర్తల్ని మరీ అసహనానికి గురి చేస్తోంది.
కార్యకర్తలను ఇప్పటికీ జగన్ రెడ్డి తన షో కోసం వాడుకుంటున్నారని వారి సమస్యలపై అసలు ఏ మాత్రం కన్సర్న్ లేదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు వేల కోట్లు ఎన్నికలకు ముందు దోచి పెట్టిన ఆయన కార్యకర్తలకు మాత్రం .. రెండు, మూడు లక్షలు కూడా మంజూరు చేయడానికి సిద్దపడలేదు. ఇప్పుడు కూడా వారిపై చిరాకుపడుతున్నారు కానీ.. సమస్యకు పరిష్కారం చెప్పడం లేదు. అవసరం అయితే బతిమాలుకోవడం లేకపోతే కాళ్ల కింద తొక్కేయడం అన్నది జగన్ పాలసీగా మారిందన్న విమర్శలు ఈ కారణంగానే వస్తున్నాయి.