రష్యా, ఐదు మద్య ఆసియా దేశాల పర్యటన ముగించుకుని స్వదేశం తిరిగి రాగానే ప్రధాని నరేంద్ర మోడీకి అనేక సవాళ్లు స్వాగతం పలకబోతున్నాయి. పాత వివాదాలకు ఓ కొత్త సవాలు తోడైంది. అదే, వ్యాపం. మధ్య ప్రదేశ్ వ్యాపం కుంభకోణంతో సంబంధం ఉన్న వారి అంతుచిక్కని మరణాలు కలకలం రేపాయి. ప్రధాని విదేశాల్లో ఉన్న సమయంలో, 48 గంటల్లో ముగ్గురు మరణించడం, వారిలో ఒకరు జర్నలిస్టు, మరొకరు మెడికల్ కాలేజీ డీన్ కావడం సంచలనం కలిగించింది. చివరకు సుప్రీం కోర్టు ఆదేశంతో కేసు సీబీఐ చేతికి వెళ్లింది.
ఇప్పుడు మధ్య ప్రదేశ్ సీఎం ను తొలగించాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. మరోవైపు, లలిత్ మోడీ వివాదం అలాగే ఉంది. కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజెలకు తొలగించాలనే ప్రతిపక్షాల డిమాండ్ కు తాత్కాలిక విరామం లభించింది. పార్లమెంటు సమావేశాల్లో ఇది దుమారం రేపే అవకాశం ఉంది. మరో మంత్రి స్మృతి ఇరానీ డిగ్రీ వివాదం, మహారాష్ట్రలో ఇద్దరు మంత్రులపై అవినీతి ఆరోపణలు పార్లమెంటులో మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం ఖాయం. ప్రతిపక్షాలు ఈ అంశాలపై కేంద్రాన్ని వీలైనంత ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తాయి.
బీజేపీకి మెజారిటీ ఉన్న లోక్ సభలో ఇబ్బంది లేదు. కానీ ప్రతిపక్షాలు బలంగా ఉన్న రాజ్యసభ సాఫీగా సాగుతుందా అనేది అనుమానమే. ప్రస్తుత శీతాకాల సమావేశాలు కూడా వివాదాల తుఫాన్ లో కొట్టుకు పోతాయేమో అని అప్పుడే అంచనాలు వినవస్తున్నాయి. వివాదాలతోనే కాలం గడిస్తే ఇక అసలు పని జరిగేదెలా? భూసేకరణ బిల్లు ఈసారైనా గట్టెక్కుతుందా లేదా చూడాలి. ఇప్పటికే దీనిపై మూడుసార్లు ఆర్డినెన్స్ తెచ్చారు. నాలుగోసారీ తెచ్చే పరిస్థితి వస్తే ప్రభుత్వ ఇమేజికి మంచిది కాదు. రాజ్యసభలో ఆమోదం పొందడం అసాధ్యం. ప్రతిపక్షాల్లో కొన్ని మద్దతిస్తే బిల్లు పాస్ కావచ్చు. కానీ ఆ అవకాశాలు కనిపించడం లేదు. కాబట్టి ఉమ్మడి పార్లమెంట్ సెషన్ ద్వారా ఆమోదం పొందడం ఒక్కటే మార్గమని కమలనాథులు భావిస్తున్నారు.
గతంలో అరుదైన సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం ఈ రాజ్యాంగ బద్ధమైన అధికారాన్ని ఉపయోగించిన సందర్భాలున్నాయి. పార్లమెంటుపై దాడి తర్వాత, ఉగ్రవాద నిరోధానికి వాజ్ పేయి ప్రభుత్వం కఠినమైన చట్టంచేస్తే కాంగ్రెస్ తోపాటు అనేక పార్టీలు వ్యతిరేకించాయి. రాజ్యసభలో బలం లేకపోవడంతో వాజ్ పేయి సర్కార్ ఉమ్మడి సమావేశాల్లో ఆమోదం పొందింది. ఇప్పుడు మోడీకి అదే మార్గం తప్పక పోవచ్చు.
దేశ అభివృద్ధికి బాటలు వేద్దామంటే పార్టీ నేతలు, మంత్రుల వ్యవహార శైలి, అనుచిత వ్యాఖ్యలు ఇబ్బందికరంగా మారింది. ఉన్న సమయమంతా వీటి పరిష్కారానికే సరిపోతే ఇక అసలు పనికి టైమ్ ఎక్కడ ఉంటుంది? ఇదే మోడీ సమస్య. ఇల్లు చక్కదిద్దుకుని బయట విమర్శలకు చెక్ పెట్టి, అభివృద్ధి పనులను వేగంగా కొనసాగించడం మోడీకి అన్నిటికీ మించిన సవాలు.