కొత్త రెవెన్యూ, పురపాలన చట్టాన్ని తీసుకొస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ చట్టం ఆమోదం కోసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని ఆయన ఇప్పుడు అంటున్నారు. రాష్ట్రంలో అవినీతి పెద్ద సమస్యగా మారిపోయిందనీ, దాన్ని పూర్తిస్థాయిలో సంస్కరిస్తామని చెప్పారు. రెవెన్యూ చట్టం పటిష్టంగా ఉంటుందనీ, అలాగ పురపాలన చట్టం కూడా ఉంటుందనీ, అధికారులు వ్యతిరేకించి ధర్నాలకు దిగినా కూడా మార్పులు ఉండవని అన్నారు. ఈ మాటల్లో ఆంతర్యం అర్థమౌతూనే ఉంది. ఉద్యోగుల నుంచి వ్యతిరేకత తప్పదనే సంకేతాలు ఇస్తున్నట్టుగా ఉంది. గవర్నమెంట్ ఆఫీసులకు సామాన్యులు వెళ్తే లంచాలు అడిగే పరిస్థితి ఉండకూడదన్నారు. హైదరాబాద్ కి ప్రత్యేక చట్టం తెస్తామని చెప్పారు. నగరంలో అడ్డగోలు నిర్మాణాలకు అడ్డుకట్ట తప్పదన్నారు.
కొత్తగా ప్రభుత్వోద్యోగాల్లోకి వచ్చేవారు ఏదో ఒక సంఘంలో చేరాలని అనుకుంటున్నారనీ, తమకు సమస్యలు వస్తే ఆ సంఘం అండదండలు ఉంటాయని భావిస్తున్నారనీ ఆ తీరులో మార్పు రావాలని కేసీఆర్ అన్నారు. కొత్తగా నియమితులైన పంచాయతీ కార్యదర్శులు ఏ ఉద్యోగ సంఘంలోనూ మూడేళ్లపాటు చేరకూడదన్నారు. అంతేకాదు, వీఆర్వోలు, ఎమ్మార్వోలు ఎవరైనా సస్పెండ్ అయితే, దాన్ని రద్దుచేయాలంటూ ఎమ్మెల్యేలు సిఫార్సులు చెయ్యకూడదన్నారు. కలెక్టర్ల దగ్గరున్న నిధుల్ని మంత్రులు, ఎమ్మెల్యేలకు బదిలీ చేసి మరింత సమర్థవంతమైన పాలన అందెలా చేస్తామన్నారు.
అవినీతి పెరిగిపోయింది, రెవెన్యూ పురపాలక కార్యాలయాల్లో లంచాలు ఎక్కువైపోయాని సీఎం చెబుతున్నారు. అంటే, ఆ పరిస్థితికి కారణం ఎవరు..? గడచిన ఐదేళ్లుగా రాష్ట్రాన్ని పరిపాలించింది ఎవరు? ఆయా శాఖల్లో అంతగా అవినీతి పేరుకుపోయేందుకు నిర్లక్ష ధోరణితో వ్యవహరించింది ఎవరు..? ఇప్పుడు కొత్తగా సమూల ప్రక్షాళన అంటే… ఎవరు చూపిన అలసత్వంపై ఈ చర్యలు..? ఇంకోటి.. సంఘాలపై ఉద్యోగులు ఆధారపడే పరిస్థితి తగ్గాలన్నారు. ఇంతకీ సంఘాలను ప్రోత్సహించింది ఎవరు..? ఎన్నికల సమయంలో ఆ సంఘాలను ఓటు బ్యాంకుగా చూసిందెవరు..? సరే, ఉద్యమ సమయంలో సంఘాలు అవసరమే అనుకుందాం. 2014లో అధికారంలోకి వచ్చాక సంఘాల ప్రమేయాన్ని తగ్గించే ప్రయత్నం ఎందుకు చెయ్యలేదు? గతంలో వేరే పార్టీలు పరిపాలించాయన్నట్టుగా, వారి నిర్లక్ష్యానికి కారణమే ప్రస్తుత దిద్దుబాటు చర్యలు అన్నట్టుగా కేసీఆర్ వ్యవహరిస్తుంటే కాస్త విడ్డూరంగా ఉంది.