హైదరాబాద్: రెడీ, దూకుడు చిత్రాలతో ఒకనాడు టాప్ డైరెక్టర్‌గా ఒక వెలుగు వెలిగిన శ్రీను వైట్లకు ఇప్పుడు సినిమా కష్టాలు చుట్టుముట్టాయి. ఇంటా, బయటా సమస్యలే సమస్యలు. మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడంటూ భార్య రూప వైట్ల కేసు పెట్టటం, అది మీడియాకెక్కటం ఒక ఎత్తయితే, ‘బ్రూస్ లీ’తో ఫ్లాప్‌ల పరంపర కొనసాగటం, రెమ్యునరేషన్ వెనక్కు ఇవ్వాల్సి రావటం మరో ఎత్తు. ఇక వీటన్నింటినీ తలదన్నేలా, క్లైమాక్స్‌లో కొత్త ట్విస్ట్‌లాగా శ్రీనుకు కోన వెంకట్ మరో ట్విస్ట్ ఇచ్చారు.
శ్రీను వైట్లకు సమస్యలు ఇప్పుడు కొత్తగా ప్రారంభం కాలేదు. ఆగడు దగ్గరనుంచే ప్రారంభమయ్యాయి. ఎప్పటినుంచో ఒక టీమ్‌గా ఉన్న కోనవెంకట్, గోపీ మోహన్‌లను పక్కన పెట్టి ఆగడు చిత్రానికి వేరే రచయితలను శ్రీను తీసుకున్నాడు. ఆగడు షూటింగ్ మధ్యలో ప్రకాష్ రాజ్‌తో గొడవ చోటుచేసుకుంది. ఇంతా చేస్తే ఆ సినమా పెద్ద ఫ్లాప్ అయింది. ఫిల్మ్ ఛాంబర్ రూల్స్ ప్రకారం హీరో, డైరెక్టర్ రెమ్యునరేషన్లో సగం నిర్మాతకు వెనక్కు ఇవ్వాలి కాబట్టి రు.2.5 కోట్లు ఇచ్చేశాడు. అప్పటినుంచి ఇంట్లో కూడా గొడవలు ప్రారంభమయ్యాయని సమాచారం. దూకుడు తర్వాత ఎంతో ఇష్టపడి కట్టించుకున్న ఇల్లు కలిసి రాలేదని అమ్మకానికి పెట్టారు. అయితే దానికి పెట్టిన ఖర్చుకూడా రావటంలేదు. ఈ పరిణామాలన్నింటితో గొడవలు ఎక్కువయ్యాయి.
ఇక రాంచరణ్ బ్రూస్లీ అవకాశం ఇస్తూనే కోన వెంకట్, గోపీ మోహన్‌లను తీసుకోవాలని కండిషన్ పెట్టాడు. మనస్ఫూర్తిగా కలిశాడో, మాటవరసకు కలిశాడో తెలియదుగానీ మళ్ళీ వాళ్ళతో కలిశాడు. కానీ రిజల్ట్ మాత్రం అనుకున్నవిధంగా రాలేదు. దానికి కోన వెంకట్ కారణమంటూ చెబుతున్నాడని ఇప్పుడు ఆరోపణ. కోన వెంకట్ మామూలుగానే ఏగ్రెసివ్ పర్సనాలిటీ. ఏదైనా తేడా వస్తే కొట్టి మాట్లాడతాడని అంటారు. బ్రూస్ లీ ఫ్లాప్ అవటానికి కారణం తనపై నెడుతున్నాడని తెలిస్తే ఎందుకు ఊరుకుంటాడు. రు.10 కోట్లకు పరువునష్టం దావా వేస్తానని అంటున్నాడట.
శ్రీను వైట్ల మొదటినుంచీ తేడాగానే ఉన్నాడు. అందరితో గొడవ పడటం, తనకు నచ్చనివారిపై తన సినిమాలలో సెటైర్లు వేయటం చేస్తూ వస్తున్నాడు. అజాత శత్రువైన సంగీత దర్శకుడు చక్రిపై కూడా కింగ్ సినిమాలో సెటైర్ వేసిన సంగతి తెలిసిందే. అంతా బాగున్నపుడు ఎన్ని సెటైర్లు వేసినా సాగుతుంది. కింద పడినప్పుడు ఆ సెటైర్లన్నీ వెనక్కివచ్చి కొడతాయి. శ్రీను వైట్లకు ఇప్పుడు జరుగుతోంది అదే!