అమరావతిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణంపై సంపూర్ణచిత్రం రాకుండానే ఉద్యోగుల తరలింపుపై హడావుడి వల్ల లేనిపోని వివాదం తలెత్తింది. ప్రభుత్వం వచ్చి తీరాల్సిందేనని హుకుం చేసింది. అరకొర కార్యాలయాలు, అద్దె మోత నివాసాలతో ఎలాగనే సంకోచానికి తోడు పిల్లల స్థానికతకు సంబంధించిన సమస్య కూడా వారిని భయపెట్టింది.హైదరాబాదునుంచి తరలిపోయే ఆఖరిదశలో ఉద్యోగులు ధర్నాలు చేయవలసిన స్థితి ఏర్పడింది. చంద్రబాబుకే మొరపెట్టుకుంటే ఆయన ఆదేశాన్ని పునరుద్ఘాటించడమే గాక ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. బిజెపి నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి దగ్గరకు వెళ్లి సమస్య చెప్పుకోవడం, తమ ఆందోళనలు ముఖ్యమంత్రి ముందు వెళ్లబోసుకోవడం అపరాధమేమీ కాదు. కాని తన నిర్ణయాలకు ఎవరో అడ్డు పడుతున్నారన్న అభద్రత, అపోహ ఆయనను వెన్నాడుతున్నాయి. . అంతిమ నిర్ణయం తీసుకోగల అధికారం ఆ బాధ్యత తనపై వున్నప్పుడు అన్ని కోణాలూ సావధానంగా ఆలకించాలి తప్ప అసహనంతో ఉపయోగమేమిటి? ఉద్యోగులపై ఆగ్రహమెందుకు?
స్థానికతకు సంబందించి రాష్ట్రపతి ఉత్తర్వు వచ్చినందుకు ఘన విజయం సాధించినట్టు చెబుతున్నారు గాని ఈ సమస్యను ఇంతకాలం పేరబెట్టవలసిన అవసరం వుందా? ఇప్పటికైనా అన్ని ప్రశ్లలకు సమాధానం లభించిందా? వివిధ చోట్ల దూరాభారాలలో ఏర్పాటు చేయాలనుకుంటున్న కార్యాలయ నివాస భవనాల సమస్య, మిగిలే వుంది. అసలు జి+4 కడతామని ప్రకటించి తర్వాత వెనక్కు తగ్గడంలో ప్రభుత్వ అసహాయత, సంధిగ్ధం కనిపిస్తొన్నాయి. ఒక్క భవనం కట్టడానికే ఇంతగా ముడిబిగించిన దేశ విదేశ కార్పొరేట్ సంస్థలు రేపు మొత్తం రాజధానిని కట్టాలంటే మరెంత ఇబ్బంది పెడతాయి? వాటి నిరాకరణ కారణంగా ఆలోచన మార్చుకున్న ప్రభుత్వం ఎల్ అండ్ టి కన్నా ఎంతో పెద్దవైన సంస్థల ముందు మరెంతగా తలవంచుతుంది? అప్పుడు భూములిచ్చిన రైతుల పరిస్థితి ఏమవుతుంది? సచివాలయ నిర్మాణంలో ఒక ప్రధాన సమస్య హద్కో ఇస్తానన్న రుణం ఇవ్వకపోవడం. దాని తిరస్కరణకు కారణం నిర్మాణం జరుగుతున్న భూమి సర్కారుది కాకపోవడం..రేపు ఆధునిక అమరావతి నిర్మాణంలో అడుగడుగునా ఇదే సమస్య అనివార్యంగా వెన్నాడుతుంది. ఆ భూమి రైతులదీ కాదు, ప్రభుత్వానిదీ కాదు. దానిపై నిర్ణయంలో వారికి భాగం వుండదు. కేంద్రం మరింత సహకరించే అవకాశం లేదని తేల్చిపారేసింది. కనుక విదేశీ సంస్థలపై ఆధారపడకతప్పదని రాష్ట్ర ప్రభుత్వం రేపు అధికారికంగానే ప్రతిపాదిస్తుంది. అప్పుడు ఏలిన వారి బినామీలు లేదా ఆశ్రిత కంపెనీలు విదేశీ సంస్థల తరపున(పేరిట) ఇక్కడ నిర్మాణాలు చేస్తాయి. ఎందుకంటే సబ్‌లీజ్‌కు ఇచ్చేందుకు వారికి హక్కు వుంటుంది.
వైఎస్ హయాంలో విశాకపట్టణంలో సింగపూర్ సిటీ పరిస్థితి ఏమిటో ఒక మాజీ మంత్రి ఇటీవల నాకు గుర్తు చేశారు. సింగపూర్‌కు చెందిన ఏవో ప్రైవేటు సంస్థలు ముందుకు వస్తే ఆ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది గనక దాన్నే అధికారిక భాగస్వామ్యంగా చూపించి వైఎస్ ప్రభుత్వం 300 ఎకరాలు మంజూరు చేసింది. ఇప్పుడు నూతన రాజధాని యావత్తూ అలాటి ఫార్ములాలే అమలవుతాయన్న మాట. కాకపోతే అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో వుండి దాన్ని వ్యతిరేకించారు, ఇప్పుడు ముందుండి నడిపిస్తున్నారు. బాక్సయిట్ తవ్వకం కథే ఇక్కడా. రైతులకు పరిహార పునరావాసాలూ స్థానికులకు ఉపాధి అవకాశాలు లేకుండా కేవలం విదేశీ సంస్థల రోడ్‌మ్యాప్ ప్రకారం అమరావతిలో నెట్టుకుపోవడం సాధ్యమయ్యేది కాదు.