గత నెలలలో తిరుమల నడక మార్గంలో ఓ పిల్లవాడ్ని చిరుత పట్టుకుపోయింది. వెంటనే కనిపెట్టి అతి కష్టం మీద తీసుకు వచ్చి వైద్యం చేసి పంపించారు. బోన్లు ఏర్పాటు చేసి చిరుతను పట్టుకున్నారు. తిరుమల గిరుల్లో అదొక్కటే చిరుత ఉందన్నట్లుగా.. ఇక నిర్లక్ష్యం ప్రదర్శించేశారు. అంతా లైట్ తీసుకున్నారు. వారి నిర్లక్ష్యం ఫలితంగా లక్షిత అనే పాప పులికి బలైపోయింది. ఇప్పుడు మళ్లీ హడావుడి ప్రారంభిచారు. ఈ కారణంతో అసలు నడక దారిని మూసేయాలని ఆలోచన చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
తిరుమలకు కాలి నడకన వస్తానని భక్తులు మొక్కుకోవడం అనేది చాలా కామన్. అది బక్తుల విశ్వాసం. అదే సమయంలో.. తిరుమల కొండపై ఖర్చులు భరించలేక ఓపిక ఉన్న వారు ఎక్కువ మంది నడుచుకుంటూ వెళ్తారు. దర్శనం టిక్కెట్ కూడా ఉచితంగా లభిస్తుంది. అందుకే ఈ మార్గాలకు భక్తులు ప్రయారిటీ ఇస్తారు. అయితే డబ్బుల మాయలో పడిపోయిన టీటీడీ.. కరోనా పేరుతో చాలా కాలంగా నడక దారులను మూసేసింది. ఇప్పుడు పులుల పేరుతో అదే పని చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఏదైనా సమస్యకు పరిష్కారం … ఆ సౌకర్యాన్ని ఆపేయడం కాదు… సమస్యకు పరిష్కారం చూపడం. పులులు దాడి చేస్తూంటే… దానికి తగ్గట్లుగా రక్షణ ఏర్పాట్లు చేయాలి. కానీ..ఇక్కడ టీటీడీ చేస్తున్నది మాత్రం తేడాగా ఉంది. టీటీడీ తీరుపై విమర్శలకు కారణం అవుతోంది. నడక మార్గంలో భద్రతను గాలికి వదిలేసి ఏదైనా జరగగానే నడక మార్గాల్ని మూసేస్తామని హడావుడి చేస్తున్నారు. సామాన్య భక్తులు.. శ్రీవారిని దర్శించుకోకుండా చేసేందుకే ఇలా చేస్తున్నారని ఆరోపణలు వస్తే అందులో వింతేముంది. ప్రతి ఒక్కరూ టీటీడీ విషయంలో ఓ ప్రత్యేక ఎజెండాతో పని చేస్తున్నారు.. అదేమిటో మరి !