ఓపక్క… ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు వరదలా పొంగుకొచ్చేస్తున్నాయంటూ అధికార పార్టీ ఊదరకొట్టడం మొదలుపెట్టేసింది. విదేశీ కంపెనీలు ఆంధ్రాతో ప్రేమలో పడుతున్నాయని సర్కారు చెబుతోంది. మొన్నటికి మొన్న దావోస్ వెళ్లొచ్చిన చంద్రబాబు… ఇండియా అంటే ఆంధ్రా అని బయట గుర్తింపు ఉందనేశారు. విదేశాల్లో తనను అందరూ గుర్తుపట్టేస్తున్నారనీ చెప్పారు. ఇదే విదేశీ మోజుతో రాజధాని డిజైన్ల తయారీని కూడా ఓ విదేశీ కంపెనీకి గతంలోనే అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడా కంపెనీ బాబు సర్కారు తీరుతో లబోదిబోమంటోంది..!
ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం చంద్రబాబు కల అనే విషయం తెలిసిందే! అందుకే, జాపాన్కు చెందిన మకీ అండ్ అసోసియేట్స్‌కి అమరావతి నిర్మాణాల డిజైన్ల తయారీ అప్పగించారు. అయితే, ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే… ఏపీ ప్రభుత్వం తీరుపై ఆ కంపెనీ దుమ్మెత్తి పోస్తోంది. చంద్రబాబు సర్కారుపై సంచలన ఆరోపణలు చేస్తూ కేంద్రానికి ఓ లేఖ రాయడంతో ఏపీ సర్కారు పరువును బజారుకు ఈడ్చినట్టే అయింది! టెండర్ ద్వారా తాము కాంట్రాక్టు దక్కించుకుంటే… ఇప్పుడు ప్రభుత్వం స్వార్థ ప్రయోనాల కోసం తమను తప్పిస్తోందని మకీ కంపెనీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. వారికి కావాల్సిన కంపెనీలను అమరావతి డిజైన్ల తయారీ కోసం ఎంపిక చేసుకునేందుకు తమను తప్పిస్తున్నారంటూ కేంద్రానికి ఆ సంస్థ ఫిర్యాదు చేసింది.
డిజైన్ల తయారీ కాంట్రాక్టు నుంచి తమను ఎందుకు తప్పిస్తున్నారో కారణం ప్రభుత్వం చెప్పలేదనీ, పైగా ముంబైకి చెందిన మరో కంపెనీతో కలిసి పనిచేయాలంటూ, వాటా ఇవ్వాలంటూ ఓ ప్రముఖ మంత్రి ఒత్తిడి తెస్తున్నారని కూడా మకీ అసోసియేట్స్ తీవ్రంగా ఆరోపిస్తోంది. ఆ ప్రముఖ మంత్రి ఎవరో ప్రభుత్వానికి తెలీదా చెప్పండీ..! రాజధాని పనులన్నీ ఆయనే దగ్గరుండి చూసుకుంటున్నారు కదా! పోనీ, ఆ కంపెనీ ఫిర్యాదుపై కేంద్రం స్పందిస్తుందా..? మోడీ సర్కారుకు తెలియకుండానే మకీ కంపెనీని ఆంధ్రా సర్కారు తప్పించి ఉంటుందా..? రాజధాని నిర్మాణంలో అడుగడుగునా కమీషన్ల కక్కూర్తి భాగోతం సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. వాటిపై వివరణ ఇచ్చేంత విధేయత తెలుగుదేశం సర్కారుకు లేదూ… అమరావతి నిర్మాణంపై ఆరోపణలకు స్పందించే తీరిక కేంద్రానికీ లేదు..!