ఉమ్మడి కడప జిల్లా అంటే వైఎస్ కుటుంబ అడ్డా. అక్కడ పది నియోజకవర్గాలు ఉంటే.. గత మూడు ఎన్నికల్లో వారిదే హవా. 2009, 2014లో టీడీపీకి ఒక్క సీటు వస్తే.. 2019లో అది కూడా రాలేదు. అలాంటి జిల్లాలో ఉన్న నియోజకవర్గం ప్రొద్దుటూరు. అయితే వైసీపీకి ఏకపక్షం కాదు. గతంలో టీడీపీ గెల్చుకున్న ఒక్క నియోజకవర్గంలో ప్రొద్దుటూరు ఉంది. అందుకే ఈ సారి ఎవరిది గెలుపన్నదానిపై పెద్ద ఎత్తున బెట్టింగులు కూడా జరుగుతున్నాయి.
ప్రొద్దుటూరు.. సీఎం జగన్ సొంత జిల్లాలోని కీలక నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో గడచిన రెండు సార్లు.. వైసీపీ పార్టీ విజయకేతనం ఎగరవేసినా ఇక్కడ టీడీపీ పార్టీ బలంగా ఉంది. నంద్యాల వరద రాజులు రెడ్డి శిష్యులుగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మల్లెల లింగారెడ్డి, రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఇప్పుడు బరిలోకి దిగి ఢీకొట్టేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం వరద రాజులు రెడ్డి, లింగారెడ్డి టీడీపీ క్యాంప్‌లో ఉండగా.. శివప్రసాద్ రెడ్డి వైసీపీలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ మధ్య వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ జరిగేలా కనిపిస్తోంది. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఎమ్మెల్యే రాచమల్లు చూస్తుండగా.. ఈ సారి పసుపు జెండా ఎగరవేసి తీరుతామంటున్నారు సైకిల్ పార్టీ నేతలు. ప్రస్తుతం గెలుపుపై ఎవరి ధీమాలో వారు ఉన్నారు.
2019 ఎన్నికల్లో ప్రొద్దుటూరులో వైసీపీ ఘన విజయం సాధించింది. ఏకంగా 59 శాతం ఓట్లు సాధించి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఘన విజయం సాధించారు. 2014 కంటే 8 శాతం ఓట్లు అధికంగా సాధించారు రాచమల్లు. టీడీపీ వరద రాజులు రెడ్డికి కాకుండా ఈ ఎన్నికల్లో మల్లెల లింగారెడ్డికి టికెట్ ఇచ్చి బరిలోకి దింపింది. అయితే ఆయన కేవలం 36 శాతం ఓట్లు మాత్రమే సాధించగలిగారు. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో వరద రాజులు రెడ్డి యాక్టివ్‌గా పాల్గొనలేదు. అంతేగాకుండా ఆయన మద్ధతుదారులు కూడా టీడీపీ అభ్యర్థికి సహకరించలేదు. అటు వైసీపీ వేవ్.. రాచమల్లు పాజిటివ్ ఇమేజ్‌తో పాటు అంతర్గత కుమ్ములాటల కారణంగా ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమిని మూటగట్టుకుంది. ఇక కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన గొర్రె శ్రీనివాసులు కేవలం 1 శాతం ఓట్లను సాధించగలిగారు.
పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న రాచమల్లుపై లెక్కలేనన్ని ఆరోపణలు ఉన్నాయి. ఆయన నియోజకవర్గంలో హత్యా రాజకీయలు కలకలం రేపాయి. మట్కా బిజినెస్ ఆయనే నిర్వహిస్తారని చెబుతారు. రామచల్లు బావమరిది మొత్తం నియోజకవర్గాన్ని గుప్పిట్లో పెట్టుకుని నడిపిస్తున్నారు. ఎమ్మెల్యే బంధువుల ఆగడాలు పెరిగాయని ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఇసుక మాఫియా , రోడ్లు వేయకపోవడం వంటి సమస్యలతో ప్రభుత్వంపైన, ఎమ్మెల్యేపైన వ్యతిరేకత ఎక్కువగా ఉంది. టీడీపీ అభ్యర్థిగా ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రచారంలో ఉన్నారు. కడప స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. కక్షసాధింపులతో ఇబ్బందులు పడటంతో ప్రజల్లో ఆయనకు సానుభూతి పరెరిగింది. నంద్యాల వరద రాజులు రెడ్డి కూడా ఇటీవల చురుగ్గా తిరుగుతున్నారు. ప్రొద్దుటూరులో ఐదుసార్లు గెలిచిన రికార్డ్ ఉంది. ఆయన కూడా టిక్కెట్ ఆశిస్తున్నారు. అయితే ప్రవీణ్ కుమార్ రెడ్డి .. ఆయన సమీప బంధువే కావడంతో.. వరదరాజులు రెడ్డికి నచ్చచెప్పి ప్రవీణ్ కే టిక్కెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
నియోజకవర్గంలో ఉన్న వైసీపీ సాంప్రదాయ ఓట్లతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కూడా చాలా ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రవీణ్ కుమార్‌ను ప్రజలు రాచమల్లుకు తగ్గ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్నారు. ఎమ్మెల్యే బావమరిది బంగారు మునిరెడ్డి ఆగడాలు ఎక్కువయ్యాయని నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో నియోజకవర్గంలో ఆశించిన అభివృద్ధి జరగలేదన్నది ఓటింగ్ ను ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల రాచమల్లుకు టిక్కెట్ ఇవ్వవొద్దని వైసీపీ నేతలు కూడా రోడ్డెక్కుతున్నారు. టీడీపీ నేతలు కలసి కట్టుగా పని చేస్తే.. వైసీపీకి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.