అభిషేక్ నామా.. టాలీవుడ్ లో కాస్త హుషారుగా సినిమాలు తీస్తున్న నిర్మాత. ఆయనకు డైరెక్షన్‌పై కూడా గురి వుంది. ‘డెవిల్’ సినిమాకు దర్శకుడిగా ఆయన పేరు టైటిల్ కార్డ్స్‌లో వేసుకొన్నారు. అయితే ఆ సినిమాకు నవీన్ మేడారం దర్శకుడు. నిర్మాతతో కొన్ని విబేధాలు రావడం వల్ల, ఆయన ప్రాజెక్టు నుంచి తప్పుకొన్నారు. నిర్మాత అభిషేక్, చివర్లో దర్శకుడిగా అవతారం ఎత్తాల్సివచ్చింది. అయితే ఇప్పుడు ఓ పూర్తి స్థాయి దర్శకుడిగా మారబోతున్నారు.
అభిషేక్ దగ్గరకు ఇటీవల ఓ మంచి కథ వచ్చింది. ఆ కథని నిర్మాతగా సెట్స్ పైకి తీసుకెళ్దామనుకొన్నారు. అయితే అటు ఇటు తిరిగి ఇప్పుడు ఆ సినిమాకు దర్శకుడిగా మారిపోయారు. విచిత్రం ఏమిటంటే ఇప్పుడు ఆయనకు నిర్మాత కూడా దొరికాడు. ‘అఖండ’, ‘పెదకాపు’ లాంటి చిత్రాల్ని అందించిన మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని తెరకెక్కిస్తారు. హీరో ఎవరు? అనేది తెలియాల్సివుంది. `పెదకాపు`తో ఆయన తన బంధువు విరాట్ కర్ణని హీరోగా చేశారు. ఇప్పుడు కూడా ఈ సినిమాలో విరాట్ నే హీరో అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇంకొన్ని రోజులు ఆగాలి.