మహేశ్‌బాబు కథానాయకుడిగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన సినిమా ‘స్పైడర్’. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ మహేశ్ అభిమానులను, ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. ‘స్పైడర్’ తరవాత వచ్చిన స్పై థ్రిల్లర్స్ ‘గరుడవేగ’, ‘గూఢచారి’ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అదే సమయంలో మహేశ్ అభిమానులకు మురుగదాస్‌పై కోపాన్ని తెప్పించాయి. తక్కువ బడ్జెట్లో చిన్న చిన్న దర్శకులు అద్భుతమైన స్పై థ్రిల్లర్స్ తీస్తుంటే… వంద కోట్ల బడ్జెట్‌తో మురుగదాస్ ముంచేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు, వంద కోట్లు ఖర్చు పెట్టిన నిర్మాతలలో ఒకరైన బి. మధు గానీ… ఎన్వీ ప్రసాద్ గానీ… ఇంతకు ముందెప్పుడూ ‘స్పైడర్’ పరాజయం గురించి మాట్లాడలేదు. తెలుగులో ‘పందెం కోడి–2’ చిత్రాన్ని విడుదల చేస్తున్న నిర్మాత బి. మధు తొలిసారి మాట్లాడారు. ‘స్పైడర్’ ఫలితం గురించి ప్రశ్నించగా… ముందు మాట్లాడటానికి నిరాకరించారు. తర్వాత ‘‘ప్రతి సినిమా ఓ పాఠమే. మనం చేసిన తప్పులకు తెలుసుకుని, కరెక్ట్ చేసుకోవాలి. కొన్నిసార్లు మనకు తప్పులు ముందే తెలుస్తాయి. ఒక రేంజ్‌కి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయలేం. ఒక్కోసారి చాలా బావుందనుకున్న పాయింట్ వర్కవుట్ అవ్వవు. బట్, అందరూ హానెస్ట్‌గా ఎఫర్ట్స్ పెట్టి చేస్తారు’’ అని ఆయన పేర్కొన్నారు. ఎవరినీ నొప్పించకుండా… అందరూ నిజాయతీగా పని చేశారని చెబుతూ… మధు సమాధానం ఇచ్చారు. గతంలో సినిమా పోస్టర్లలో ఈయన ‘ఠాగూర్’ మధు అని పేరు వేసుకునేవారు. ఇప్పుడు బి. మధు అని వేసుకుంటున్నారు.