ప్రముఖ తెలుగు సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ హైదరాబాద్ లోని కార్యాలయాన్ని కోటక్ మహీంద్ర బ్యాంక్ అధికారులు ఈరోజు సీజ్ చేసారు. ఆయన అసలు వడ్డీ కలిపి సుమారు రూ.7 కోట్లకు పైగా కోటక్ మహీంద్ర బ్యాంక్ కి చెల్లించవలసి ఉంది. కానీ ఎన్నిసార్లు గుర్తు చేసినా ఆయన ఆ మొత్తం చెల్లించకపోవడంతో ఈరోజు బ్యాంక్ అధికారులు ఆయన కార్యాలయానికి తాళాలు వేసి తమ అధీనంలోకి తీసుకొన్నారు. బెల్లంకొండ సురేష్ అనేక హిట్ చిత్రాలను నిర్మించారు. ఆయన కొడుకు శ్రీనివాస్ కూడా అప్పుడే అల్లుడు శీను, స్పీడున్నోడు అనే రెండు సినిమాలలో నటించి మూడవ సినిమాకి సిద్దం అవుతున్నాడు. కనుక బెల్లంకొండ ఆర్ధిక పరిస్థితి బాగానే ఉందని భావించాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఆయన పరిస్థితి ఇంతవరకు తెచ్చుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇటువంటి సంఘటనలు చూసినప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ మేడిపండు చందాన్న ఉన్నట్లు అనిపిస్తుంది.