ఈవారం విడుదల అవుతున్నచిత్రం అమీతుమీ. ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. క్లాసీ డైరెక్టర్ అనిపించుకొన్న ఇంద్ర గంటి మోహనకృష్ణ నుంచి వస్తున్న చిత్రమిది. సో… ఫ్యామిలీ ఆడియన్స్ త్వరగా కనెక్ట్ అయిపోతారు. మల్టీప్లెక్స్‌లో ఈ సినిమాకి బాగానే టికెట్లు తెగే అవకాశం ఉంది. పైగా.. జెంటల్మెన్ సినిమా తరవాత ఇంద్రగంటి నుంచి వస్తున్న సినిమా కావడంతో ట్రేడ్ వర్గాల్లోనూ ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే.. నిర్మాతలు మాత్రం ఈ సినిమాని సొంతంగా రిలీజ్ చేసుకోవడంపైనే మొగ్గు చూపారు. కొన్ని ఏరియాలు తప్ప ఎక్కడా అమ్మలేదు. దాంతో పాటు.. శాటిలైట్ కూడా ఇవ్వలేదు. ఇంద్రగంటి సినిమా అంటే… ఎంత కాకపోయినా కనీసం రూ.1.5 కోట్లయినా శాటిలైట్ రూపంలో దక్కించుకోవొచ్చు. శాటిలైట్‌ని అమ్ముకొన్నా సగం బడ్జెట్ రాబట్టుకొనే వీలుంది. అయితే… ఈ సినిమాని అమ్మడానికి ప్రొడ్యూసర్లు ముందుకు రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇంద్రగంటి సినిమాలు టీవీలో సూపర్ హిట్. అష్టాచమ్మాకి ఇప్పటికీ రేటింగులు బాగానే వస్తాయి. బాక్సాఫీసు దగ్గర ఏమాత్రం ప్రభావితం చూపించలేని గోల్కొండ హైస్కూల్ కూడా టీవీలో బాగానే ఆడింది. అందుకే.. అమీ తుమీ శాటిలైట్‌ని నిర్మాత ఇంకా ఎవ్వరికీ ఇవ్వలేదు. విడుదలయ్యాక ఇంకా మంచి రేటు వస్తుందన్న నమ్మకమో ఏమో..?